సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సిద్ధంగా లేదు. సోమవారం లోపు.. కార్మికులందరికీ జీతాలిస్తామని హైకోర్టుకు తెలిపిన.. ఆర్టీసీ యాజమాన్యం.. తీరా సోమవారం వచ్చే సరికి ..ఆర్టీసీ వద్ద సొమ్ము లేదనే సమాచారాన్ని హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ వద్ద రూ.7.5 కోట్లే ఉన్నాయన్న అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ కార్మికులకు నెల జీతాలు చెల్లింపునకు రూ.224 కోట్లు కావాల్సి ఉందన్నారు. కార్మికులు సెప్టెంబర్ నెల మొత్తం పని చేశారు. వర్కింగ్ డేస్‌ను సెప్టెంబర్ 20వరకే ఉంటుంది. నెలవారీ జీతాల సైకిల్ ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకూ లెక్కిస్తారు. ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తారు. ఈ లెక్క ప్రకారం.. జీతాల బిల్లు… చాలా ముందుగానే రెడీ అయి ఉంటుంది.
కార్మికులు ఐదో తేదీ నుంచి సమ్మె ప్రకటన చేశారు. ఆ లోపు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఆర్టీసీ యాజమాన్యం వ్యూహాత్మకంగానే జీతాలు నిలిపివేసింది. సమ్మెకు, జీతాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా… కావాలనే జీతాలు ఆపేశారని..కార్మికులు ఆరోపిస్తున్నారు. నిజానికి కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులున్నాయని.. చెప్పిన ఒకటో తేదీ ఇవ్వాల్సిన జీతం.. ఐదో తేదీ ఇస్తున్నారు. ఇలా ఇస్తున్నా… ఉద్యోగ సంఘాలు అభ్యంతర పెట్టలేదు. ఈ వెసులుబాటును ఉపయోగించుకున్న ప్రభుత్వం.. సమ్మె ప్రారంభించిన ఉద్యోగులకు జీతాలు నిలిపివేసి.. షాక్ ఇచ్చింది. జీతాలు లేకుండానే.. ఆర్టీసీ కార్మికులు దసరా పండుగ చేసుకున్నారు.
ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది. అయినప్పటికీ వారికి జీతాలు అందలేదు. ఇచ్చే ఉద్దేశం కూడా లేదని… హైకోర్టులో అడ్వకేట్ జనరల్ చేసిన వాదనతోనే స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. అంటే.. కార్మికులకు ఈ నెల జీతాలు అందనట్లే. నిధులు లేవనే మాట అబద్దమని.. కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని పూర్తి ఆధారాలతో సహా తదుపరి విచారణలో కోర్టు ముందుంచాలని నిర్ణయించాయి.