ఆ ఒక్క డిమాండ్ ను పక్కన పెడితే.. ఇతర డిమాండ్ల పరిశీలనకు సిద్దమని తెలంగాణ సర్కార్ సంకేతాలు పంపింది. విలీన డిమాండ్ మినహా.. ఇతర వాటిని పరిశీలించడానికి ఆర్టీసీ ఈడీలతో ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని .. కార్మికుల తరపు న్యాయవాదులు వాదించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో.. కార్మికుల ఇతర డిమాండ్లు పరిశీలించాలని… ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ నియమించిన కమిటీ హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను అందిస్తుంది. హైకోర్టు ద్వారానే సమ్మెకు పరిష్కారం లభిస్తుందని.. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలంగాణ సర్కార్ నిర్ణయానికి వచ్చింది.
ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి.. రోజులు గడిచిపోతున్నాయి. రోజు రోజుకు సమస్య పీట ముడి పడిపోతోంది కానీ.. పరిష్కార మార్గాలు మాత్రం కనిపించడం లేదు. అటు ప్రభుత్వం.. ఇటు కార్మికులు.. ఎవరూ వెనక్కి తగ్గేందుకు సిద్దంగా లేకపోవడమే కారణం. కార్మికులు కాస్త తగ్గి చర్చలకు సిద్ధమని చెబుతున్నా …ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. కార్మిక సంఘాలతో చర్చల ప్రసక్తే లేదని తేల్చేసింది. కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారనే విధానానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. వేగంగా పరిస్థితుల్ని అదుపులోకి తేవడానికి ప్రైవేటు బస్సులకు టెండర్లను ఆహ్వానించింది. తాత్కాలిక సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నారు. అయితే.. ఈ చర్యలన్నీ సమస్యలను పరిష్కరించేవిగా కాకుండా.. మరింత పెంచేవిగా మారుతున్నాయి. కార్మికులు.. తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు.
చర్చలు జరపాల్సిందేనని హైకోర్టు నుంచి ఆదేశాలు ఉండటంతో.. ప్రభుత్వానికి ఇప్పుడు మరో మార్గం లేకుండా పోయింది. 18వ తేదీన హైకోర్టు… 19వ తేదీ ఉదయం పదిన్నర కల్లా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని… ఆదేశించింది. అయితే కోర్టు ఆర్డర్ కాపీ అందలేదన్న కారణంగా ప్రభుత్వం ఈ ఆదేశాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చలు జరపడమే మేలన్న అభిప్రాయంతో ఉన్నతాధికారులు ఉన్నారు. అర్టీసీ విలీనం తప్ప..మిగతా డిమాండ్లు పెద్దవేమీ కాదన్న అభిప్రాయం ప్రభుత్వంలోనే ఉంది. ఆర్టీసీ సమ్మెకు ఏదో ఓ పరిష్కారం చూపించాల్సిన సమయం దగ్గర పడింది. అందుకే… వేగంగా కీలక పరిమామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.