మొన్నటి కేబినెట్ భేటీలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి, ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా వేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ ఆర్టీసీ సంఘాలతో చర్చలకు వెళ్లింది. సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు అన్వేషిస్తామనీ, పండుగ సమయంలో సమ్మెలకు దిగి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని కూడా ప్రభుత్వం చెప్పింది. కానీ, అవేవీ వర్కౌట్ కాలేదు. సమ్మె చేసేందుకు ఆర్టీసీ సంఘాలు సిద్ధమైపోయాయి. సమ్మె తప్పదనీ… ఆర్టీసీని బతికించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామనీ, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నందుకు క్షమించాలంటూ ఆర్టీసీ ఏయేసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం అన్నారు. ఈనెల 5 నుంచి సమ్మె ప్రారంభమౌతోందనీ, ఎస్మా లాంటివి ప్రభుత్వం ప్రయోగించినా భయపడేది లేదన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో రెండుసార్లు ఆర్టీసీ సంఘాలు సమావేశమైంది. అయితే, తమ డిమాండ్లపై కమిటీ నుంచి స్పష్టమైన హామీలేవీ రాకపోవడంతో సమ్మె బాట పడుతున్నట్టు ఆర్టీసీ సంఘాల నేతలుఅంటున్నారు. ప్రభుత్వం వేసే కమిటీలపై ఎప్పుడూ నమ్మకం లేదనీ, గతంలో కూడా ఇలాంటి కమిటీలు చాలా వచ్చాయనీ, కమిటీల వల్ల కాలయాపనే తప్ప సమస్యలు పరిష్కారం కావని అంటున్నారు. త్రిసభ్య కమిటీని ఏ ప్రాతిపదిక వేశారనీ, వీరికి ఉన్న అధికారాలేంటనేది ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి, ఆర్టీసీ జేయేసీతో నేరుగా, కమిటీలు లేకుండా ప్రభుత్వమే చర్చించేందుకు సిద్ధపడితే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ బలంగా ఉంది, ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఏమాత్రం సానుకూలంగా లేదు. మూడు జోన్లను రెండు సంస్థలుగా చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే… దాన్ని ఆర్టీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది… దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదని ఆర్టీసీ కార్మికులున్నారు. కాబట్టి, సమస్య జఠిలంగానే కనిపిస్తోంది. ఏదేమైనా పండుగపూట ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అనేది స్పష్టం. ఇక, ఇదే అదునుగా భావించి ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ షురూ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతుందో లేదో చూడాలి.