తిరుమల లడ్డూ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, టీటీడీ దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతను మెరుగుపర్చినట్లు టీటీడీ పేర్కొంది.
భక్తులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఇక ఆలయంలోని అన్ని చోట్ల సంప్రోక్షణ చేసినట్లు ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. శ్రీవారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఇదంతా చేశామని తెలిపారు. పుర్ణాహుతితో అన్ని దోషాలు వెళ్లిపోతాయని, భక్తులెవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.
ఇప్పటి వరకు ఉన్న అనేక అనుమానాలతో దోషాలు లేకుండా శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందు ఉన్న దోశం, పవిత్రోత్సవాలతోనే పోయింది. లడ్డూ ప్రసాదం విషయంలో ఇక ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగినా.. హోమం, సంప్రోక్షణతో తొలగిపోతాయన్నారు.
మార్చిన నెయ్యితోనే ప్రస్తుతం ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం తయారు అవుతుందని ప్రధాన అర్చకులు ప్రకటించారు.