తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లను ప్రభుత్వం ఏ క్షణమైనా ప్రకటించనుంది. ఇప్పటికి ఒక్క చైర్మన్ ను మాత్రమే నియమించారు. సభ్యులను నియమించాల్సి ఉంది. కానీ సభ్యుల నియామకం విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో కానీ పెద్ద ఎత్తున సభ్యుల్ని నియమించడానికి రంగం సిద్ధం చేసుకుంది. టీటీడీ బోర్డులో వివిధ కేటగిరీల కింద 24 మంది సభ్యులను నియమిస్తే ప్రత్యేక ఆహ్వానితుల కింద మరో 50మందికి పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూసినా దాదాపుగా టీటీడీ బోర్డు పదవుల్లోకి 80 మంది ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో పదవి అంటే ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఎలా పడితే అలా అందర్నీ నియమిస్తే పవిత్ర దెబ్బతింటుంది. అందుకే గత ప్రభుత్వాలు టీటీడీ బోర్డు సభ్యుల విషయంలో చాలా కఠినంగా ఉండేవి. బోర్డులో పన్నెండు మంది వరకే ఉంచేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టాలను మార్చింది. 24 మంది పాలకమండలి సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులతో పాలక మండలిని ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 80 కి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పాలక మండలి సభ్యుల సంఖ్యను అధికారికంగా పెంచాలనుకున్నా ఇప్పుడు కష్టం కాబట్టి ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో చేర్చాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
టీటీడీ బోర్డు సభ్యుడంటే కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కొండ పైన పర్మినెంట్ గా కాటేజీ, ఎప్పుడు వెళ్లినా అవసరాలు చూసుకోవడం, వాహనం, రోజుకు రెండు వందల బ్రేక్ దర్శన టిక్కెట్లు కేటాయిస్తూ ఉంటారు. భక్తుల సొమ్ముతో వారికి ఇవన్నీ కేటాయించాల్సి ఉంటుంది. కేంద్రంలో పనులు చేసుకోవడానికి టీటీడీ బోర్డు పదవుల్ని క్విడ్ ప్రో కో పద్దతిలో ఇస్తున్నారని ఇందు కోసం ప్రత్యేక విమానాల్లో విజయసాయిరెడ్డి పలు రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. టీటీడీ బోర్డు సభ్యుల ప్రకటన తర్వాత మరింత దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.