టీటీడీ ఆగస్టు ఏడో తేదీ నకల్యాణ మస్తు కార్యక్రమం చేపట్టిందని … పెళ్లి ఖర్చులు పెట్టుకోలేని పేదలకు సామూహిక వివాహాలు జరిపిస్తామని.. దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించింది. బంగారం తాళిబొట్టుతో పాటు కొత్త సాయం కూడా అందే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పేదలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే చివరికి ఏడో తేదీ వచ్చే సరికి టీటీడీ సైలెంట్ అయిపోయింది. ఎక్కడా సామూహిక వివాహాలకు ఏర్పాట్లు చేయలేదు. చివరికి ఇంకా ప్రభుత్వం అనుమతి రాలేదని వచ్చాక చేస్తామని కవరింగ్ లెటర్ విడుదల చేశారు.
ఇది శ్రావణ మాసం . పెళ్లిళ్ల సీజన్. పెళ్లి చేసుకుందామని టీటీడీపై ఆశతో.. నమ్మకంతో వేల పెళ్లి జంటలు సొంతంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోకుండా వేచిచూస్తూ ఉండిపోయారు. కానీ ఇప్పుడు టీటీడీ హ్యాండివ్వడంతో వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. నిరుపేదల ఇళ్లల్లో పెళ్లి అంటే ఎంత కష్టమో.. వాళ్లకు తెలియకపోవచ్చు.. కానీ వారితో ఆట ఆడుకోవడం మాత్రం టీటీడీకి అంత మంచిది కాదు. ప్రభుత్వం అనుమతి లేకుండా అసలు కల్యాణమస్తు పథకం ఎలా ప్రకటిస్తారు ? చివరికి వచ్చే సరికి ఎందుకు ప్రభుత్వ అనుమతి లేదని చెబుతుందో అంతు పట్టని విషయం.
వైఎస్ హయాంలో కల్యాణమస్తు పథకాన్ని .. టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి నిర్వహించారు. ఆ పథకానికి మంచి పేరు వచ్చింది. అందుకే మళ్లీ పెట్టాలనుకున్నారు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుని తేదీ కూడా ప్రకటించారు. దరఖాస్తులు కూడా తీసుకున్నారు. కానీ చివరికి హ్యాండిచ్చారు. ఇది దేవుడి తరపున కార్యాలు చక్కబెట్టేవారు చేయాల్సిన పని కాదు.