దేవాదాయశాఖ చట్టం మేరకు ఒక్కసారి పాలకమండలి నియామకం జరిగితే…. కాలపరిమితి పూర్తి అయ్యేవరకు వారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. సభ్యులు రెండు సమావేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకూండా హజరుకాకున్నా లేక వారిపై క్రిమినల్ కేసులు నమోదైతే గాని వారిని తొలగించలేరు. దీంతో పాలకమండలిని తొలగించాలి అంటే ప్రభుత్వం దేవాదాయ శాఖ చట్టాని మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలి. గత ఏడాది ఏప్రిల్ మాసంలో అప్పటి ప్రభుత్వం పుట్టా చైర్మన్ గా 18 మంది సభ్యులతో రెండేళ్ళ పదవి కాలంతో పాలకమండలిని నియమించింది. వీరు అదే మాసం 28వ తేదిన పాలకమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. జీవో ప్రకారం వీరి పదవి కాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేది వరకు వున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జగన్ సీఎం కావడంతో సాధరణంగానైతే పాలకమండలి రాజీనామా చేయ్యాలి. ఐతే పుట్టాతో పాటు కొంత మంది రాజీనామ చేసేందుకు ససేమిరా అంటున్నారు.
నైతికంగా అయితే… కొత్త ప్రభుత్వం కొలువుదీరినా తన పదవికి రాజీనామా చేయాలి. ఓ వైపు నూతన పాలకమండలిని నియమించేందుకు తాజా ప్రభుత్వం సిద్ధమవుతున్నా.. మరోవైపు పుట్టా మాత్రం తన బెట్టు వీడటం లేదు. హుందాగా తప్పుకోవాల్సింది పోయి.. ప్రభుత్వమే బలవంతంగా తొలగించే పరిస్థితిని పుట్టా కొని తెచ్చుకుంటున్నారు.
టీటీడీ కొత్త పాలక మండలి చైర్మన్గా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును జగన్ దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుతమున్న పాలకమండలి రాజీనామా చేయకపోవడం ప్రభుత్వానికి చికాకు తెప్పిస్తోంది. ఆర్డినెన్స్ తెచ్చి పాత పాలకమండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్గా పుట్టా ఆది నుంచి వివాదాల్లో చిక్కకున్నారు. గత ఆర్థిక మంత్రి యనమలకు వియ్యంకుడు కావడం… నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీకి సాయం చేశాడన్న కారణంగా పుట్టాకు ఈ పదవి దక్కిందని చెప్పుకుంటారు.
ఏదేమైనా గత ప్రభుత్వ పాలన ముగిసింది. నేతలు ఒక్కొక్కరుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. అయితే పుట్టా మాత్రం ఇంకా ట్రస్టు బోర్డు ఛైర్మన్ తానే అంటూ ఊగిసలాడటం బాగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా అధికారులు ఓవర్ యాక్షన్ చేసిన కారణంగానే తాను ఛైర్మన్ గా రాజీనామా చేయలేదంటూ చెప్పడం సిబ్బందిలో ఆగ్రహం తెప్పిస్తోంది. ఇదిలా ఉంటే పుట్టా పంతానికి పోయి తన గౌరవాన్ని తానే పోగొట్టుకోవడం బాగోలేదంటూ టీడీపీ నేతలే కొందరు బాహాటంగా విమర్శిస్తున్నారు. అయితే సెంటిమెంట్ పేరుతో.. పుట్టా మాత్రం పదవిని పట్టుకుని వేలాడుతున్నారు.