హనుమంతుని జన్మస్థానం తిరుమలేనని… అంజనాద్రే ఆంజనేయుడు పుట్టిన ప్రాంతమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అంతే కాదు చారిత్రక ఆధారాలున్నాయని వాటిని ఉగాది నాడు ప్రకటిస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ ప్రకటన వాయిదా వేసుకున్నారు. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెబుతోంది. ఇప్పటికే టీటీడీ పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ..పరిశోధనచేసి.. హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని నిర్ధారించింది. అయితే… టీటీడీ ప్రకటనపై ఇప్పటికే వివాదం బయలుదేరింది.
కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హంపి ఆంజనేయుని పుట్టుక ప్రాంతం అనేందుకు ఆధారాలు ఉన్నాయని వారు ప్రకటను చేస్తున్నారు. టీటీడీ తొందరపడకుండా, నిపుణులను చరిత్రకారులను సంప్రదించిన తర్వాతే ప్రకటించాలని వారు హితవు పలుకుతున్నారు. వీరి అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రకటన చేస్తే.. తిరుమలను వివాదాల్లోకి లాగినట్లవుతుందన్న ఉద్దేశంతో టీటీడీ శ్రీరామనవమికి ప్రకటనను వాయిదా వేసినట్లుగా కనిపిస్తోంది. ఒక్క ప్రకటన మాత్రమే కాదని.. ఆధారాలను కూడా చూపిస్తామని టీటీడీ చెబుతోంది.
హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించారని టీటీడీ చెబుతోంది. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుని బృహత్సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంత గల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు. దీన్ని పుస్తక రూపంలో తీసుకు వస్తామని కూడా చెబుతోంది. వివాదం అయ్యే అవకాశం ఉందని తెలిసి కూడా టీటీడీ … ఎందుకు ప్రకటనపై ఇంత ఉత్సాహం చూపిస్తుందో పలువురికి అర్థం కావడం లేదు. ఇంత సున్నితమైన అంశాన్ని దేశవ్యాప్త నిపుణుల ఏకాభిప్రాయంతో ప్రకటించినప్పుడే తిరుమలపై వివాదాలు రేగకుండా ఉంటాయని కొంత మంది సూచిస్తున్నారు.