తిరుమల వెంకన్న దర్శనానికి వాన, ఎండ, చలి అని తేడా లేకుండా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి భక్తులు వస్తుంటారు. దేవదేవుని దర్శన భాగ్యం కోసం ఎంతో వేచి చూస్తారు. గంటల తరబడి క్యూలైన్స్ లో నిలిచి ఉన్నా… వేంకటేశ్వర స్వామి వారిని చూస్తే ఆ బాధలన్నీ గుర్తుకు రావు.
ప్రతి రోజు వేలాది మంది భక్తులకు టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎక్కడో ఒక లోపం కనపడుతూనే ఉంటుంది. కానీ, టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏపీ సహ అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనే కాదు రాయలసీమలోనూ ఈసారి మంచి వర్షపాతమే నమోదైంది. తిరుమల కొండలపైనే కాదు శేషాచలం అడవుల్లోనూ మంచి వర్షాలే పడుతున్నాయి. అయినా, ఇప్పుడు తిరుమల కొండపై తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.
తిరుమల కొండపై నీటి ఆంక్షలు విధించారు. దాతలు నిర్మించిన వసతి గృహాలకు టీటీడీ నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. కావాల్సిన వారు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే బాలాజీ నగర్ లో వారానికి ఒకసారి నీటిని విడుదల చేయబోతుండగా, దుకాణ సముదాయాలకు రోజుకు కేవలం 8గంటల పాటే నీటి సరఫరా ఉంటుందని సూచించినట్లు సమాచారం.
ఎండాకాలంలో నీటి ఎద్దడి కారణంగా ఇలాంటి పొదుపు చర్యలు సహజమే. కానీ, వర్షాకాలం మధ్యలో నీటి ఎద్దడి ఉందంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అసలు శేషాచలం అడవుల్లో ఉండే గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం, కుమారధార, పసుపుధారలలో నీళ్లు లేవా అన్న చర్చ మొదలైంది.
కఠిన నిర్ణయాలు తీసుకుంటూ… టీటీడీ పరిపాలనను గాడిలో పెడుతున్న అధికారిగా పేరు తెచ్చుకున్న కొత్త ఈవో శ్యామలరావు దీనిపై ఎలా వివరణ ఇస్తారో చూడాలి.