దేవుడి సన్నిధిలో పవిత్రమైన విధులు నిర్వహిస్తూ… వ్యవస్థల్ని ధిక్కరిస్తున్నారు అధికారులు. నేరుగా ఈవోనే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో చివరికి హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష.. రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానా కట్టకపోతే.. మరో వారం రోజులు జైల్లో ఉండాలని ఆదేశించింది. తమను రెగ్యులరైజ్ చేయాల్సి ఉన్నా.. ఉ్దదేశపూర్వకంగా చేయడం లేదని గతంలో ముగ్గురు టీటీడీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ముగ్గుర్ని రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించింది.
అయితే నెలలు గడిచిపోతున్నా.. టీటీడీ ఈవో మాత్రం ఈ తీర్పును పట్టించుకోలేదు. ఆ ఉద్యోగులు వేచి చూసి చూసి.. చివరికి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈవోకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిజానికి ఏపీలో అధికారులపై కొన్ని వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. అయితే ఇవన్నీ బిల్లులకు సంబంధించినవి. ప్రభుత్వానికి పనులు చేశామని బిల్లులు ఇవ్వలేదని .. కోర్టుకెక్కి.. అనుకూలమైన తీర్పు వచ్చినా అమలు చేయలేదని ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసేవే.
అయితే ఇప్పుడు టీటీడీ ఈవో కు మాత్రం అలాంటి కేసు కాదు. ఉద్దేశపూర్వకంగా ఆ ఉద్యోగుల్ని క్రమబద్దీకరించడంలేదు. హైకోర్టు చెప్పినా చేయలేదు. ఎందుకు చేయలేదో కోర్టుకు చెప్పుకోవాల్సింది. అలా కూడా చెప్పుకున్నట్లుగా లేరు. ఉద్దేశపూర్వకంగా హైకోర్టును నిర్లక్ష్యం చేసినట్లుగా స్పష్టం కావడంతో.. జైలు, జరిమానా విధించింది. గతంలో చాలా మంది అధికారులకు శిక్ష పడింది కానీ.. వారు డివిజన్ బెంచ్‌కు.. వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బహుశా ధర్మారెడ్డికూడా అదే చేయవచ్చు. కానీ ఆయనకు పడిన శిక్ష మాత్రం రికార్డుల్లో ఉంటుంది.