మరో ఐదు రోజుల్లో తిరుమలలో ఘనంగా పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టాల్సిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి చనిపోయారు. గత మూడు రోజులుగా చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఎక్మో ఆధారిత చికిత్స పొందుతున్నారు. హార్ట్ ఎటాక్ రావడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు మూడు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ ఉదయం ఆయన కన్ను మూశారు.
చంద్రమౌళి రెడ్డి వయసు 28 సంవత్సరాలు. ఆయన కొంత కాలంగా ముంబైలో ఉంటున్నారు. అక్కడే ఉండి… సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారని చెబుతున్నారు. గత జూన్ లో .. తిరుమలలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. చెన్నైకు చెందిన వివాదాస్పద వ్యాపారవేత్త శేఖర్ రెడ్డి కుమార్తెను చంద్రమౌళి రెడ్డి పెళ్లాడాల్సి ఉంది. 26నే తిరుమలోల పెళ్లి చేయాలని సంకల్పించారు ఈ పెళ్లికి ఆహ్వానాలు పంచుతున్న సమయంలోనే హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన రక్షణ శాఖ ఉద్యోగి, అయినప్పటికీ వైఎస్ కుటుంబీకులు ఎవరు అధికారంలోకి వచ్చినా డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి ప్రధానంగా టీటీడీలోనే పని చేస్తూంటారు. ప్రస్తుతం ఆయనకు క్యాడర్ కాకపోయినా ఈవోగా పని చేస్తున్నారు. కుమారుడి మరణంతో ధర్మారెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలు సంతాపం చెబుతున్నారు.