టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారన్న ప్రచారం ఒక్క సారిగా గుప్పుమంది. ఆయనను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారని తేలింది. వెంటనే ధర్మారెడ్డి చెన్నై వెళ్లారు. అయితే ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని గుండె పోటు అనే సమాచారం అధికారికంగా ఇచ్చారు. కానీ ఈ విషయంలో అనేక అనుమానాలు మాత్రం అలాగేనే ఉన్నాయి.
ధర్మారెడ్డి కుమారుడు ప్రస్తుతం నిరుద్యోగి. ఆయన సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారని చెబుతున్నారు. ఇటీవల ఆయనకు .. తమిళనాడుకు చెందిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త శేఖర్ రెడ్డి కుమార్తెతో పెళ్లి కుదిరింది. తిరుమలలోనే ఘనంగా నిశ్చితార్థం చేశారు. జూన్లో నిశ్చితార్థం జరిగినా ఇంత వరకూ పెళ్లి చేయలేదు. అయితే ఇప్పుడు పెళ్లి పత్రికలు పంచడానికే ఆయన చెన్నైకి వెళ్తే గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై ఎక్కువగా గోప్యత పాటిస్తున్నారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగి. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చి.. టీటీడీలోనే పని చేస్తూంటారు. వైఎస్ ఉన్నప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు కూడా అలాగే .. గత నాలుగేళ్ల నుంచి టీటీడీలో ఉన్నారు. ఐఏఎస్ లకే ఈవో పోస్టు ఇవ్వాల్సి ఉన్నా..ఆయనకు పదవి కట్టబెట్టారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడయిన ఆయన కుమారుడు ఇంకా స్థిరపడలేదు. ఇప్పుడిలా ఆస్పత్రి పాలయ్యారు.