శ్రీవారి ఆలయం ఎంతో పవిత్రమైనది. కొండ మీద గోవింద నామం తప్ప మరొకటి వినిపించకూడదని అనుకుంటారు. కానీ అక్కడ ప్రతీ రోజూ వివాదాలే. కొండపైకి వచ్చే భక్తులు ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తారని ఎవరూ అనుకోరు. కానీ వారు మాత్రం రచ్చ చేస్తున్నారు. జరుగుతున్నదంతా జరిగిపోతుంది. అయితే అదంతా అవాస్తవం అని చెప్పుకోవడానికి టీటీడీ పీఆర్వో విభాగం పని చేస్తుంది. దాదాపుగా ప్రతీ రోజూ ఖండన ప్రకటనలు తిరుమల ప్రజాసంబంధాల విభాగం నుంచి వస్తున్నాయి. ఇలాంటి దుస్థితి టీటీడీకి ఎందుకు వచ్చింది.
శివాజీ బొమ్మ వివాదంతో పలుచనైపోయిన టీటీడీ
ఇటీవల మహారాష్ట్ర నుంచి ఓ భక్తుడు తిరుమలకు వెళ్లేందుకు అలిపిరికి వచ్చాడు. ఆయన కారులో శివాజీ విగ్రహం ఉంది. దాన్ని తీసేయాల్సిందేనని సిబ్బందిప పట్టుబట్టారు. ఎందుకు తీసేయాలో ఎవరికీ తెలియదు. శివాజీని పవిత్రంగా భావించే ఆ మహారాష్ట్ర భక్తుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే మహారాష్ట్ర మొత్తం భగ్గుమంది. టీటీడీ కవర్ చేసుకోవడానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరికి మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేకంగా తీసుకు వచ్చి.. సన్మానాలు చేసి వారితో శివాజీని బాగా గౌరవిస్తామని ప్రకటలు చేయించుకోవాల్సి వచ్చింది.
తప్పు మాది కాదని చెప్పుకవడానికి ప్రతీ విషయంలో టీటీడీ తంటాలు !
ఇప్పుడు నటి అర్చనా గౌతం వ్యవహార కూడా అంతే ఉంది. టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిచకపోతే.. అక్కడ ఆమెకు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. రెండు వైపులా వీడియోలు బయట పెట్టుకున్నారు. చివరికి టీటీడీ అదంతా అబద్దమని.. వాదించడానికి ఓ రోజంతా యంత్రాంగాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అదే సమయంలో రాధామనోహర్ దాస్ అనే స్వామిజీ టీటీడీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేసే విమర్శలు నిజం కాదని చెప్పలేక.. ఆయనపై కేసులేస్తామని టీటీడీ వాదిస్తోంది.
ప్రశ్నించినందుకు బీటెక్ రవిపై వెంటనే కేసు !
ఇటీవల తాను గది కోసం కట్టిన కాషన్ డిపాజిట్ తిరిగివ్వడం లేదని… ఆరోపించినందుకు టీడీపీ నేత బీటెక్ రవిపై అప్పటికప్పుడు కేసు పెట్టారు. నిజానికి ఆ రీఫండ్ తిరిగి ఇవ్వడం లేదని ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతామన్నట్లుగా టీటీడీ తీరు ఉంది. ఇక వైసీపీ నేతలు కొండ మీద చేసే దర్శనాలు… అది వారి సొంతమేమో అన్నట్లుగా మారిపోయింది. వందల మందితో దూసుకెళ్లిపోతున్నారు. వారికి అడ్డే ఉండటం లేదు. మళ్లీ గుడి ముందే రాజకీయాలతో విపక్ష నేతలపై దారుణమైన భాష వాడుతున్నారు. పవిత్రంగా ఉంచాల్సిన టీటీడీ పరిపాలన ఇలా కావడం భక్తుల్ని అసహనానికి గురి చేస్తోంది.