తిరుమలలో ఏదో వివాదం…లైవ్లో ఉండకపోతే…టీటీడీ అధికారులకు నిద్ర పడుతున్నట్లుగా లేదు. స్వరూపానందనే టీటీడీకి పెద్ద అన్నట్లుగా ఇచ్చిన అతిధి మర్యాదల రచ్చ కొనసాగుతూండగానే… గొల్లమండపం అంశాన్నితెరపైకి తీసుకు వచ్చారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే ఈ గొల్ల మండపాన్ని తొలించేందుకు టీటీడీ సిద్దమవుతున్నట్లుగా అధికారులు సమాచారాన్ని లీక్ చేశారు. ప్రస్తుతం గొల్లమండపం బలహీనంగా ఉందని, ఏ క్షణంలోనైనా కూలే అవకాశముందని చెబుతూ.. సన్నిధిగొల్ల కుటుంబీకులనే… తరలించాలని కోరారు. అయితే ఈ నిర్మాణం కేవలం సన్నిధిగొల్ల కుటుంబాలకు చెందినది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాదవుల మనోభావాలకు చెందిన అంశమంటూ యాదవులు ఆగ్రహిస్తున్నారు.
గొల్లమండపాన్ని అంగుళం కదిలించినా ఊరుకునేది లేదని యాదవ సంఘాలు ఆందోళనకు దిగాయి. గొల్లమండపానికి చరిత్ర ఉంది. రామానుజాచార్యుల ఆదేశాల మేరకు జరిగిన పలు మండపాలు, ఆలయం చుట్టూ వీధులు, మఠాల నిర్మాణాలను చూసిన గొల్ల వనిత తాను పాలు, పెరుగు విక్రయించగా వచ్చిన సొమ్ముతో తానే గొల్లమండపాన్ని నిర్మించిందంటారు. తొలుత గొల్లమండపం వెయ్యికాళ్ల మండపానికి అనుకుని ఉండేది. 2003 నాటికి వెయ్యికాళ్లమండపాన్ని తొలగించారు. కానీ గొల్లమండపం జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయలేదు. 2006లో గొల్లమండపాన్ని కూడా అక్కడి నుంచి తరలించాలని టీటీడీ భావించింది. యాదవులు ప్రతిఘటించడంతో ఆగిపోయింది. 2008 తర్వాత అప్పటి పాలకమండలి గొల్లమండపం తరలింపు అంశంపై దృష్టిపెట్టింది.
నిపుణుల ఆదేశాల మేరకు గొల్లమండపం చాలా బలహీనంగా ఉందని, వెంటనే అక్కడి నుంచి తరలించాలని భావించారు. అయితే ఆ నిర్ణయాన్ని యాదవులు ఒప్పుకోలేదు. అ అప్పట్లో గొల్లమండపానికి ఉన్న నాలుగు స్తంభాలకు ఇనుప రాడ్లతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇప్పుడు మళ్లీ బలహీనంగా ఉందనే నివేదికతో.. తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గొల్లమండపానికి మరమ్మతులు చేయాల్సి వస్తే యాదవులందరూ కలిసి మరమ్మతులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని యాదవులు చెబుతున్నారు. కానీ దాన్ని తొలగించడానికే.. టీటీడీ ప్రయత్నిస్తోంది. దాంతో వివాదం పెరిగి పెద్దదవుతోంది.