తిరుమల శ్రీవారికి రూ. మూడు వందల కోట్లు విరాళం ప్రకటిస్తూ.. ఓ భక్తుడు మందుకు వచ్చాడు. ఆ భక్తుడి పేరు సంజయ్ కే సింగ్. ఆయన ఉండేది ముంబైలో. అద్వైత్ ఇన్ఫ్రాస్చ్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ అనేకంపెనీ యజమాని., ఈ కంపెనీని 2017లో ప్రారంభించారు. పుట్ట పగిలిపోయేంత లాభాలు సంపాదించినట్లుగా రికార్డుల్లో లేదు. అసలు రూ.మూడు వందల కోట్ల వ్యాపారం చేసినట్లుగా కూడా.. క్లారిటీ లేదు. కానీ.. ఆయన వచ్చి రూ. మూడు వందల కోట్లతో ఆస్పత్రి కట్టిస్తానంటే… టీటీడీ అధికారులు ఎంవోయూ చేసేసుకున్నారు. మీడియాకు గొప్పగా చెప్పుకున్నారు. 300 పడకల ఆసుపత్రిని నిర్మించి టీటీడీకి అప్పగిస్తారని… యంవోయూ చేసుకున్నారు.
సంజయ్ సింగ్ ఆస్పత్రి కట్టిస్తానని ముందుకు వచ్చారు. ముందూ వెనుకా చూసుకోకుండా టీటీడీ ఒప్పందం చేసుకోవడం భక్తులను ఆశ్చర్య పరుస్తోంది.ఆ సంజయ్ సింగ్కు మూడు వందల కోట్లు ఎలా వస్తాయో కనీస పరిశీలన చేయలేదు. కట్టగలరో లేదో కూడా పరిశీలించలేదు. అదే కేరళలో మాత్రం భారీ విరాళం ఇస్తామన్న ఓ వ్యక్తిని ఆదాయ ఆధారాలు కూడా తీసుకు రమ్మన్నారు. కేరళ రాష్ట్రం కొచ్చిన్లోని చొట్టనిక్కర్ భగవతి ఆలయానికి గత నవంబరులో కర్ణాటకకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 526 కోట్ల విరాళం ప్రకటించారు. పెద్ద మొత్తంలో ఇస్తున్నారు కదా అని ఆలయ పాలక మండలి… రాచమర్యాదలు చేయలేదు. ఈ నిధుల్ని వినియోగించేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది.
ఆ నిధులన్నీ ఎలా సంపాదించారో చెప్పాలని కోరింది. అయితే.. ఆ సమర్పణకు దాత గడువు కోరాడు. ఆయన వివరాలిచ్చిన తర్వాతనే ఆ విరాళం వినియోగం గురించి పాలక మండలి ఆలోచిస్తుంది.కేరళకు చెందిన దేవాదాయ మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరాల్ని తెలుసుకున్న తరువాతనే ముందుకెళ్లాలని నిర్ణయించింది. సంజయ్ సింగ్ నుంచి కేరళ ఆలయ వర్గాలు తీసుకున్నట్లుగా వివరాలు సేకరించాలన్న సూచనలు వస్తున్నాయి.