కరోనా కే్సులు పెరుగుతూండటం… టీటీడీ ఉద్యోగులు.. అర్చకుల్లోనూ పాజిటివ్ బారిన పడుతున్న వారు ఎక్కువవుతూండటంతో.. తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలనే డిమాండ్.. విస్తృతంగా వినిపిస్తోంది. శ్రీవారి కైంకర్యాలను పర్యవేక్షించే జియ్యంగార్లు సైతం.. కరోనా బారిన పడటం.. మాజీ ప్రధాన అర్చకులు మృతి చెందడంతో .. దర్శనాలను నిలిపివేసే అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా టీటీడీ చైర్మన్ చెప్పారు. అయితే.. అతి మాట వరుసకే. దర్శనాలు నిలిపివేసే ఉద్దేశం టీటీడీకి లేదు. ఆగస్టు కోటాకు సంబంధించిన టిక్కెట్లను.. గుట్టుచప్పుడు కాకుండా… ఆన్ లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచేసింది టీటీడీ. ప్రతీ సారి.. ఇలా టిక్కెట్లు ఆన్ లైన్లో పెడుతున్నప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చేవారు. ఈ సారి అలాంటి సమాచారం ఏదీ ఇవ్వలేదు.
శ్రీవారి పూజా కైంకర్యాలను కొనసాగిస్తూ… భక్తుల దర్శనాలను మాత్రం ఆపుతారని.. జరుగుతున్న ప్రచారానికి.. ఆగస్టు కోటా టిక్కెట్ల జారీతో.. చెక్ పెట్టింది టీటీడీ. మరో వైపు.. టీటీడీ ఉద్యోగుల్లో కరోనా బాధితులు పెరిగిపోతూండటంపై ఉద్యోగుల సంఘం ఆందోళన వెలిబుచ్చుతోంది. తిరుపతిలో.. లాక్ డౌన్ అమలవుతోందని.. అందుకే.. టీటీడీ ఉద్యోగులకూ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అవకాశం ఉన్న ఉద్యోగులకు.. వర్క్ ఫ్రం హోం.. మిగిలిన వారిలో 33 శాతం మందికి మాత్రమే డైలీ డ్యూటీలు ఉండాలని కోరుతున్నారు. తిరుపతిలో లాక్ డౌన్ మినహాయింపులకు తగ్గట్లుగా విధి నిర్వహణ వేళలు ఉండాలని అంటున్నారు.
టీటీడీ మాత్రం… అటు ఉద్యోగుల ఆందోళను.. ఇటు కరోనా కేసుల పెరుగుదలను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. దర్శనాలు మాత్రం ఆపేది లేదని చేతలద్వారానే చెబుతున్నారు. కొండపైకి వస్తున్న భక్తులకు ర్యాండమ్ పరీక్షలు చేస్తున్నామని.. వైరస్ సోకిన వారు ఇంత వరకూ ఒక్కరు కూడా కొండపైకి రాలేదని అంటున్నారు. అయితే.. టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల రాక కూడా తగ్గింది. పన్నెండు వేల మంది భక్తులకు అనుమతి ఇస్తూంటే.. ఆరు వేల మంది మాత్రమే వస్తున్నారు.