తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో ధర్మారెడ్డి అనే అధికారిని… ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి మరీ నియమించింది ప్రభుత్వం. ఆయన ఐఎఎస్ కాదు.. ఐపీఎస్ కాదు.. కేంద్ర డిఫెన్స్ ఎస్టేట్ అధికారి మాత్రమే. అయనను ఏపీకి తీసుకురావాల్సినంత అవసరం.. అదీ తీసుకొచ్చి.. టీటీడీలో కీలక పోస్టు అప్పగించాల్సినంత సందర్భం కూడా లేదు. కానీ ఆ ధర్మారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్‌కి కూడా. గత ఎన్నికల సమయంలో.. కేంద్ర హోంశాఖలో ఉండి.. ఈసీ వద్ద వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు రావడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. చంద్రగిరిలో రీపోలింగ్ వెనుక ఉన్నది ఆయనేనని.. అప్పట్లో టీడీపీలో ఉన్న సీఎం రమేష్ సంచలన ఆరోపణలు కూడా చేశారు. లంచాలిచ్చారని కూడా.. ప్రకటించారు. అలాంటి ధర్మారెడ్డిని ఏరి.. కోరి సర్కార్ ఏపీకి తేవడంలో వింత లేదు.
మొన్నటిదాకా జేఈవోగా.. ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజు ఉన్నారు. ఆయనను బదిలీ చేశారు. ఈవోగా అశోక్ కుమార్ సింఘాల్ ఉన్నారు. ఆయనను.. చంద్రబాబు ఏరికోరి నియమించారనే కోణంలో.. ఆయనపై.. వైసీపీకి ఆగ్రహం ఉంది. అందుకే.. గతంలో.. టీటీడీ బంగారం తరలింపు విషయంలో.. ఆయనపై నేరుగానే ఆరోపణలు చేశారు. గతంలో.. రమణదీక్షితులతో కలిసి.. విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసినప్పుడు… తమపై.. పరువు నష్టం కేసు దాఖలు చేశారన్న ఆగ్రహం కూడా వైసీపీ నేతల్లో ఉంది. అయితే.. బదిలీలు చాలా చేసినప్పటికీ.. ఆయనను మాత్రం కదల్చలేదు. ఆయనను అక్కడే ఉంచి.. టీటీడీలో డమ్మీ చేయాలని… నిర్ణయించుకున్నారు. అందుకే ధర్మారెడ్డిని జేఈవోగా మరోసారి నియమించారు.
మొదటి నుంచి ఈవో, జేఈవో పోస్టులకు.. ఐఏఎస్‌లనే నియమిస్తూ వస్తున్నారు. అక్కడ ఉంటే.. రాష్ట్ర, దేశ, విదేశీ ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికి ఐఏఎస్ లలో చాలా మంది టీటీడీలో పోస్టింగ్ కోసం పోటీ పడుతూంటారు. సంప్రదాయానికి భిన్నంగా మొట్టమొదట వైఎస్ 2004లో ఐడీఈఎస్ క్యాడర్‌కు చెందిన అధికారి అయిన ధర్మారెడ్డిని తిరుమల జేఈవో నియమించారు. మధ్యలో ఓ సారి కరుణాకర్ రెడ్డి ఆగ్రహంతో.. బదిలీ అయినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ అదే పోస్టులో చేరారు. తన వద్ద పని చేసే వ్యక్తి ఆత్మహత్యకు ఆయన వేధింపులే కారణమని ఆరోపణలు రావడంతో… ధర్మారెడ్డి నియామకంపైనే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. 2010లో మళ్లీ ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు అదే పదవిలోకి తిరిగి వచ్చారు.