రన్ అనే ఓ సినిమాలో రోడ్ సైడ్‌లో ఐదు రూపాయలకే బిర్యానీ బోర్డు కనిపిస్తే సునీల్ వెంటనే ఓ ప్లేట్ లాగించేస్తాడు. తర్వాత అతని గొంతు నుంచి కాకి అరుపులు వస్తూంటాయి. ఇదేంటి ఇప్పటి వరకూ బాగానే ఉన్నా కదా నా నోట్లో నుంచి కాకి అరుపులు వస్తున్నాయి అని పక్కనున్నోడ్ని డౌట్ అడుగుతాడు. నువ్విచ్చిన ఐదు రూపాయలకు కాకి అరుపులు కాకుండా.. కోడి అరుపులు వస్తాయా . . వెళ్లహే అని ఆ వ్యక్తి విసుక్కుంటాడు. అప్పుడు సునీల్‌కు క్లారిటీ వస్తుంది. తనకు కాకి బిర్యానీ పెట్టారని. ఐదు రూపాయలకు బిర్యానీ వస్తుందని తిన్నాడు కానీ.. ఐదు రూపాయలకు ఎలా ఇస్తాడని ఆలోచించలేదు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ అధికారులు, రాజకీయ నేతలు.. సునీల్ కన్నా ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించారు. టెండర్లు.. రివర్స్ టెండర్లు పేరుతో … డెడ్ చీప్ గా అత్యంత నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తామంటూ వస్తే వెంటనే వారికి ఇచ్చేశారు. అంత చీప్ గా ఎలా ఇస్తారు అనే కనీస ఆలోచన చేయలేదు. ఇలా బయట అనుకుంటున్నారు. కానీ.. కమిషన్ల కక్కుర్తితో… ఇలా చేశారని అందరికీ తెలుసు. ఆ కమిషన్లు ఎంత తీసుకున్నారు.. ఎవరికి ముట్టాయన్న సంగతిని పక్కన పెడితే వారు బేసిక్స్ మర్చిపోయినట్లుగా నటించారని అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ వచ్చాక తిరుమలలో అన్నింటి చార్జీలు పెంచేశారు. పాతిక రూపాయలు ఉండే లడ్డూను యాభై రూపాయలు చేశారు. ఉచితంగా ఇచ్చే లడ్డూను తగ్గించారు. కానీ.. తక్కువ ధరల పేరుతో అత్యంత నాసిరకం నెయ్యిని తెప్పించి భక్తుల మనోభావాలతో ఆటలాడారు. ఇప్పుడు బాగోతం బయటపడేసిరికి… టెండర్లు, రివర్స్ టెండర్లని వాదిస్తున్నారు. అసలు అవి పెట్టుకుందే… కమిషన్లు నొక్కేయడానికి కదా. ఆ మాత్రం ఎవరికి తెలియదని అనుకుంటున్నారా ?. మొత్తానికి కాసుల కక్కుర్తితో ఎవరూ చేయని.. చేయకూడనంత ఘోరాపచారం చేసేశారు.