తిరుమల శ్రీవారి చరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం వచ్చిన రోజుగా.. జూలై 25వ తేదీ నిలిచింది. ఒక్క రోజే.. రూ. 6.28 కోట్లు.. హుండీల ద్వారా శ్రీవారి ఖజానాకు జమ చేరాయి. ఇది టీటీడీ చరిత్రలోనే అత్యధికం. సాధారణంగా.. రోజుకు రూ. 3కోట్లకు అటూ ఇటూగా.. శ్రీవారి హుండీ ఆదాయం ఉంటుంది. కానీ ఇరవై ఐదో తేదీ మాత్రం.. పంట పండినట్లయింది. సాధారణం.. ఈ రోజు హుండీ ఆదాయం రేపు లెక్కిస్తారు. అలా చూసుకుంటే.. ఈ మొత్తం ఇరవై ఐదో తేదీన హుండీల్లో పడినట్లయింది. గతంలో రెండుసార్లు గరిష్ఠంగా హుండీ ఆదాయం నమోదైంది. 2012, ఏప్రిల్ 2న శ్రీరామ నవమి పర్వదినం నాడు రూ. 5.73 కోట్ల ఆదాయం సమకూరగా.. అదే సంవత్సరం జనవరి 1న కొత్త ఏడాది రోజు . 4.23 కోట్లు ఆదాయంగా వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ రికార్డును తాజాగా అధిగమించారు.
సాధారణంగా.. ఇంత పెద్ద మొత్తం హుండీల్లో లభించిందంటే.. ఆజ్ఞాత భక్తులు ఒకరో ..ఇద్దరో ఒకేసారి పెద్ద మొత్తంలో వేస్తూ ఉంటారు. ఇప్పుడు విరాళాలకు కూడా పక్కా లెక్కలు ఉంటున్నాయి. గతంలో.. టీటీడీకి విరాళాలు ఇచ్చేవారు.. తమ వివరాలను గోప్యంగా ఉంచమని చెప్పేవారు. కొంత మంది తమ వివరాలేమిటో కూడా చెప్పకుండా విరాళాలు ఇచ్చి వెళ్లేవారు. కానీ ఇప్పుడు టీటీడీకి వచ్చే విరాళాలకు కూడా పక్కా సమాచారం తీసుకుంటున్నారు. అందుకే… గోప్యంగా కొంత మంది హుండీల్లో పెద్ద మొత్తం వేసి వెళ్లిపోతున్నారు. ఇలా ఎవరైనా … ఒకే భక్తుడు..పెద్ద మొత్తంలో వేశారా లేదా అన్నదానిపై క్లారిటీ రాలేదు.
నిజానికి నోట్ల రద్దు సమయంలో.. శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. లెక్కలు లేని సొమ్ము ఉన్న చాలా మంది.. ఊరినే పోగొట్టడం ఎందుకని… తీసుకొచ్చి..శ్రీవారి హుండీల్లో వేసేవారు. అప్పుడు కూడా ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లేదు. ఆ తర్వాత… నోట్ల మార్పిడి గడువు ముగిసిన తర్వాత శ్రీవారి హుండీ నిండటం గగనమయింది. రోజుకు రూ. 2 నుంచి రూ.3 కోట్ల మధ్యే ఆదాయం ఉండేది. ఇప్పుడిప్పుడే నోట్ల కష్టాలు తీరడంతో.. వడ్డీ కాసుల వాడికి.. వడ్డీలకు కావాల్సినంత హుండీ ఆదాయం వస్తోంది.