తిరుమలలో శ్రీవారికి భక్తులు ఎంతో పవిత్రంగా మొక్కులు చెల్లిస్తారు. తాము మొక్కుకున్నప్పటి నుండి దేవుడి దగ్గర పెట్టిన డబ్బులన్నీ తెచ్చి హుండీలో వేస్తారు. అయితే మొక్కుల సొమ్మును మళ్లీ భక్తులకే ధన ప్రసాదం పేరుతో పంపిణీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ప్రసాదం అని పేరు పెట్టారు కానీ అది ఉచితంకాదు. భక్తులు హుండీల్లో వేస్తున్న చిల్లర అంతా పరకామణి గోడౌన్లో పేరుకు పోతోంది. బ్యాంకులు కూడా జమ చేసుకోవడం లేదు. దీంతో టీటీడీ అధికారులు ఈ కానుకల సొమ్మును భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్క రూపాయి నాణాలు వంద వరకూ ప్యాకింగ్ చేసి దానిపై ధన ప్రసాదం అని స్టిక్కర్ వేసి.. భక్తులకు టీటీడీ తరపున ఎక్కడైతే చిల్లర ఇవ్వాలో అక్కడ ఈ నిజమైన చిల్లర ఇవ్వడం ప్రారంభించారు.
ఉదాహరణకు తిరుమలలో గదులను బుక్ చేసుకునేటప్పుడు కాషన్ డిపాజిట్‌ను కట్టించుకుంటున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆ కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. ఇప్పుడు ఆ కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లింపులు శ్రీవారి ధన ప్రసాదం పేరుతో ఈ కానుకల చిల్లరను చేతిలో పెడుతున్నారు. సెంటి్మెంట్గా చాలా మంది వద్దని అనడం లేదు. తీసుకు వస్తున్నారు. దీంతో టీటీడీ అధికారుల ప్లాన్ వర్కవుట్ అవుతోంది. వారి దగ్గర పేరుకుపోతున్న చిల్లరను క్లియర్ చేసుకుంటున్నారు. కానీ వారు ఎవరైతే ఆ కానుకలు శ్రీవారికి సమర్పించారో.. ఆ భక్తులకే అవి అంటగడుతూండటం విస్మయపరుస్తోంది.
ఎవరైనా భక్తుడు ముడుపులు చెల్లించుకుని వస్తే.. మళ్లీ అతని సొమ్మే చిల్లర రూపంలో అక్కడ తిరిగి ఇస్తారు. భక్తులకు ఇది విచిత్రంగా అనిపిస్తోంది. అయితే బ్యాంకులతో రకరకాల గొడవలు పెట్టుకుని వ్యాపార సంస్థలుగా వాటిని లెక్కలోకి తీసుకుని ఉచిత సేవలు వద్దని చెప్పి పంపేసిన తర్వాత ఆ బ్యాంకులు చిల్లర బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో టీటీడీ అధికారులు ఆ కష్టాన్ని కూడా భక్తులపై నెట్టేస్తున్నారు. ఎంతైనా తెలివిమీరిపోయారు మరి..!