తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కరానికోసారి బాలాలయ అష్టభందన మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే నెల 12 నుంచి పదహారో తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయంలో మరమ్మతు పనులును నిర్వహించుకోవడమే మహాసంప్రోక్షణ. అక్కడ చెయ్యవలసిన మరమ్మతులను బట్టి మహసంప్రోక్షణ కార్యక్రమం ఎన్ని రోజులనేది… ఆగమ పండితులు నిర్ణయిస్తారు. శ్రీవారి ఆలయంలో 5 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు ఆగమ పండితులు. శ్రీవారి గర్బాలయంలోకి అర్చకులు,జియ్యంగార్లు మినహా మరేవ్వరిని అనుమతించరు.మరమ్మతులు కూడా శ్రీవారి ఆలయంలో అర్చకులే నిర్వహిస్తారు. ఇతర ఆలయాలలో నిర్వహించినట్లు స్థపతి,ఇంజనిరింగ్ సిబ్బందిని గర్భాలయంలోకి అనుమతించరు.
మహాసంప్రోక్షణ కారణంగా 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేయనున్నారు. ఈ నిర్ణయానికి నికి భక్తుల రద్దీని కారణంగా చెబుతున్నారు. సంప్రోక్షణ కార్యక్రమాల వల్ల నిత్యం 25 వేలమంది భక్తులుకు మించి దర్శనం చేయించే అవకాశం లేదు. గతంలో మహా సంప్రోక్షణ చేసినా.. దర్శనం నిలిపివేయలేదు. అప్పట్లో.. పాతిక వేల మంది భక్తులు మాత్రమే రోజుకు వచ్చేవారని.. అందు వల్ల ఇబ్బంది లేదని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు రోజుకు లక్ష మంది కొండపైకి వస్తున్నారంటున్నారు. సెలవులు కలసి రావడంతో..సంప్రోక్షణ సమయంలో… లక్షలాది మంది భక్తులు తరలివస్తే వారు క్యూ లైనులోనే 3 రోజులు పాటు వేచివుండవలసి వస్తుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
టీటీడీ చరిత్రలోనే శ్రీవారి దర్శనాలను సుదీర్ఘంగా నిలిపివేయడం ఇదే మొదటి సారి అవుతుంది. గ్రహణాల సమయంలో… మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో… పన్నెండు గంటల నుంచి ఒక్క రోజు వరకు.. శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయని కానీ.. ఇలా దాదాపుగా వారం రోజుల పాటు.. భక్తులెవరూ కొండకు రావొద్దని చెప్పడం విమర్శలకు తావిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీపై ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. అని.. రమణదీక్షితులు లాంటి వారు ఎదురు చూస్తున్నారు. సామాన్యభక్తులు కూడా.. ఈ విషయంలో అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో టీటీడీ తనే స్వయంగా తనపై విమర్శలు తెచ్చుకునేలా వ్వహరించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.