తిరుమలలో అధికారుల అత్యుత్సాహం కారణంగా మహారాష్ట్ర సమాజం అంతా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇప్పుడు టీటీడీ తలలు బద్దలు కొట్టుకుంటోంది. మరాఠీ ప్రముఖుల్ని పిలిపించి.. గౌరవంగా చూసి.. వారితో ప్రకటనలు ఇప్పిస్తోంది. తిరుమలలో ఎలాంటి వివక్షా లేదని చెప్పించడానికి తాపత్రయ పడుతోంది. ఆదివారం పలువురు మహారాష్ట్ర ప్రముఖులను అలా టీటీడీ ఆహ్వానించి ఎప్పుడూ లేనంత గౌరవం ఇచ్చి అలాంటి ప్రకటనలు చేయింది. ఇదంతా మహారాష్ట్ర మీడియాలో విస్తృత ప్రచారం వచ్చేలా చూసుకుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. అధికారుల అత్యుత్సాహమే కారణం.
తిరుమలలో ఇటీవల నిబంధనల పేరిట రకరకాల ఆంక్షలు పెట్టారు. అందులో ఒకటి తిరుమల కొండపైకి వచ్చే వాహనాల్లో అన్యమత గుర్తులు.. బొమ్మలు ఉండకూడదని. ఈ రూల్ చెప్పుకోవడానికి బాగుంది.. కానీ ఆచరణకు వచ్చే సరికి.. కారులో ఎవరి బొమ్మలూ ఉండకూడదని సెక్యూరిటీ సిబ్బంది లాగి పడేస్తున్నారు. అలా మహారాష్ట్రకు చెందిన భక్తుడు ఛత్రపతి శివాజీ బొమ్మను కారులో పెట్టుకుని వస్తున్నారు. కానీ సెక్యూరిటీ అనుమతించలేదు. ఆ బొమ్మను తీసేయాల్సిందేనన్నారు . ఛత్రపతి శివాజీ బొమ్మ అన్యమత చిహ్నం ఎలా అవుతుదో సెక్యూరిటీకే తెలియాలి. వెంటనే శివాజీని టీటీడీ అవమానిస్తోందని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు . అది వైరల్ అయిపోయింది.
దీంతో టీటీడీ తీరుపై మహారాష్ట్ర సమాజంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో మరాఠీలు మండి పడుతున్నారు. ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎలాంటి వివక్షా లేదని చెప్పడానికి టీటీడీ ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్ర ముఖ్యుల్ని పిలిపించుకుని వారితో శివాజీ విగ్రహాన్ని బహుమతిగా తీసుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇది ఒక్క వివాదమే కాదు.. ప్లాస్టిక్ బ్యాన్ అంటూ రచ్చ చేసి.. లీటర్ వాటర్‌ను రూ. 55కు అమ్ముతున్న ఘనత కూడా టీటీడీ వారిదే.