శ్రీవారికి సొమ్ము రూ. రెండు కోట్లు ఎవరు ఇస్తారు…?. ఇప్పుడు టీటీడీ వర్గాలకు ఇదే ప్రశ్న సూటిగా తగులుతోంది . వడ్డీతో సహా సహా కట్టాలని టీటీడీ బోర్డు, అధికారులను విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకూ ఈ రెండు కోట్లేమిటటంటే.. శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై గతంలో టీటీడీ వేసిన రూ. వంద కోట్ల పరువు నష్టం పిటిషన్‌కు సంబంధించిన కోర్టు ఫీజు. తెలుగుదేశం పార్టీ హయాంలో పింక్ డైమండ్ ఉందని.. దాన్ని చంద్రబాబే విదేశాలకు తరలించారని అర్థం వచ్చేలా.. అప్పటి వరకూ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు… ఎంపీ విజయసాయిరెడ్డి ప్రచారం చేశారు.
అదే పనిగా శ్రీవారి ప్రతిష్ట దెబ్బతినేలా ప్రచారం చేశారు. దీంతో టీటీడీ … వారిపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని రూ. రెండు కోట్ల మేర ఫీజు కట్టి… కోర్టులో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై పరువు నష్టం పిటిషన్ వేశారు దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత.. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని.. కొత్త టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఎవరికీ తెలియకుండా ఉపసంహరణ పిటిషన్ కూడా కోర్టులో వేసింది. శ్రీవారిపై నమ్మకం ఉందని వారిద్దరూ ప్రకటించారని అందుకే ఉపసంహరించుకుంటున్నామని టీటీడీ ఆ విత్ డ్రా పిటిషన్లో చెప్పింది. టీటీడీ తీరుపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేసుకు చెల్లించిన రూ. 2 కోట్లు వడ్డీతో కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి హుండీలో కానుకలు వేయొద్దన్న రమణదీక్షితులును మళ్లీ ఎందుకు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రస్తుతానికి టీటీడీ బోర్డు పెద్దలు సైలెంట్‌గా ఉన్నారు.