తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తీసుకు వస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే దీనికి ఓ షరతు పెట్టింది. అదేమిటంటే.. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం. బీజేపీకి ఓటు వేస్తే.. ఆ ఓటు.. తిరుపతి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే…టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి.. ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తెస్తామనేది బీజేపీ హామీ. అయితే నిజంగా కాస్త విశాలంగా ఆలోచిస్తే.. ఎంపీ స్థానంలో ఉండే వ్యక్తి… లేదా ఒక్క ఎంపీ గెలవడం ద్వారా.. బీజేపీ టీటీడీని తాను అనుకున్నట్లుగా ధర్మాచార్యులకు అప్పగించగలదా అని ఆలోచిస్తే… అచ్చంగా పొలిటికల్ హామీ అని సులువుగానే అర్థమవుతుంది.
టీటీడీని నిజంగా ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలంటే కేంద్రానికి క్షణంలో పని. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి తిరుపతిలో బీజేపీ గెలవనక్కరలేదు. లోక్సభలో నాలుగు వందలమందికిపైగా ఎంపీల మద్దతు ఉంది. ఏమైనా చేయవచ్చు. బీజేపీని గెలిపిస్తేనే చేస్తామంటూ ప్రకటనలు చేయడం రాజకీయ జిమ్మిక్కు. ఇప్పటికే టీటీడీ వ్యవహారాలను రాజకీయం చేసి బీజేపీ చాలా సార్లు లబ్ది పొందే ప్రయత్నం చేసింది. ఇప్పుడూ అదే పని చేస్తోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా.. టీటీడీ వ్యవహారాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగులుగా ఉండటం దగ్గర్నుంచి అన్యమత ప్రచారం వరకూ అన్నిరకాల వివాదాలు ఏర్పడుతున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అయితే రాజకీయంగా ఆరోపణలు చేయడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది కానీ.. పవిత్రతను కాపాడటానికి కాదు.
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు…కోర్టుల్లో లిటిగెంట్ పిటిషన్లు వేసి హైకోర్టులు నోటీసులు జారీ చేస్తేనే హడావుడి చేస్తూంటారు. టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని ప్రకటనలు చేస్తూంటారు. అయితే ఇవి.. తమకు నచ్చని ప్రభుత్వాలు ఉన్నప్పుడే చేస్తారు. మిగతా సమయంలో .. అంటే తమకు ఇష్టమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు… సైలెంట్ గా ఉంటారు. బీజేపీ కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. భక్తుల మనోభావాలతో ఓట్ల వేట చేస్తోంది.