రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిపై గతంలో దాఖలు చేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకోవడం లేదని.. టీటీడీ కోర్టుకు తెలిపింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రమణదీక్షితులు చేసిన పింక్ డైమండ్, పోటులో తవ్వకాలు వంటి ఆరోపణలు చేశారు. వాటి ఆధారంగా విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటి టీటీడీ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించి.. రూ. వంద కోట్లకు పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేసింది. పరువు నష్టం కలిగించినందున చెరో వంద కోట్లు చెల్లించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇందు కోసం రూ. రెండు కోట్లను కోర్టు ఫీజుగా చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది.
రాజకీయాల కోసం శ్రీవారి ఆలయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతల చేతికే అధికారం వచ్చింది. అధికార పెద్దల చేతుల్లోనే టీటీడీ ఉంది కాబట్టి ఇప్పుడా పిటిషన్లను ఉపసంహరించుకోవాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అదే వివాదాస్పదం అయింది. అప్పుడు వారు చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపితమైతే … పిటిషన్ ఉపసంహరించుకోవడం ఎందుకన్న వాదన వినిపించడం ప్రారంభమయింది. వారు చేసిన ఆరోపణలు నిజమైతే.. నిరూపించాలని.. కాకపోతే వారిపై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదేమీ లేకపోతే.. కోర్టులో కట్టిన రూ. రెండు కోట్ల కోర్టు ఫీజును.. టీటీడీ బోర్డు సభ్యులే చెల్లించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.
చివరికి వారిపై ఉన్న పరువు నష్టం కేసును కొనసాగిస్తామని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి వద్ద టీటీడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. కొన్నాళ్ల క్రితం దాఖలు చేసిన పరువు నష్టం కేసును వెనక్కు తీసుకునే పిటీషన్ను రద్దు చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేసింది. అయితే.. లోక్ అదాలత్ ద్వారా కేసు ఉపసంహరణ చేసుకుంటే….టీటీడీ చెల్లించిన రెండు కోట్లు వెనక్కి వచ్చే అవకాశం ఉందని.. అలా పరిష్కరించుకుంటే … బాగుంటుందని న్యాయసలహా రావడంతోనే టీటీడీ వెనక్కి తగ్గిందన్న ప్రచారం జరుగుతోంది.