తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు సంగతి డౌటే అని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆంధ్రాలో టీడీపీతో కలిసి పయనిస్తామని చెబుతూనే… తెలంగాణలో పొత్తు ఉండదని స్పష్టమైన సంకేతాలే ఇచ్చేశారు. దీంతో టి.టీడీపీకి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. కేసీఆర్ ను గద్దెదింపేందుకు కాంగ్రెస్ తోపాటు వామపక్షాలతో కలిసి రంగంలోకి దిగేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై తాజాగా ఆయన స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు వద్దని వారు అనుకుంటే, వారితో కలిసి ముందుకు సాగేందుకు టీడీపీ కూడా సిద్ధంగా లేదని రేవంత్ స్పష్టం చేశారు. పేదలకు మేలు చేయడం కోసం, రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుందన్నారు.
నిజానికి, కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగే అంశమై తొందరపడొద్దని ఈ మధ్య చంద్రబాబు చెప్పినా కూడా, రేవంత్ మరోసారి ఇదే టాపిక్ తెర మీదికి తెచ్చారు. కాంగ్రెస్ తో కలిసేందుకు టీటీడీపీ సిద్ధంగా ఉందని రేవంత్ మరోసారి స్పష్టం చేసినట్టయింది. అయితే, టీడీపీ సిద్ధంగా ఉన్నా… కాంగ్రెస్ మాటేంటి అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న..? ఎందుకంటే, తెలంగాణలో కాంగ్రెస్ నెమ్మదిగా పుంజుకుంటోందని ఇటీవలే కొన్ని సర్వేలు చెప్పాయి. అంతేకాదు, తెరాస తరువాత రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఆ విషయం కేసీఆర్ విమర్శల్లోనే ఎప్పటికప్పుడు అర్థమౌతోంది. తెలంగాణలో ప్రస్తుతం తెలుగుదేశం స్థానం ఎక్కడో ఉంది. టీడీపీలో పేరున్న నాయకులు లేరు. ఉన్న ఆ ఇద్దరు ముగ్గురిపైనా సవాలక్ష ఆరోపణలున్నాయి. పోనీ.. టీడీపికి అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉందా అంటే.. తెలంగాణలో అదీ కనిపించడం లేదు. ఏరకంగా చూసుకున్నా టీడీపీతో కలవడం అనే ప్రతిపాదన కాంగ్రెస్ కి ప్లస్ అనిపించడం లేదు. అలాంటప్పుడు తెలుగుదేశం స్నేహ హస్తం చాచినంత మాత్రాన కాంగ్రెస్ కౌగిలించుకుంటుంది అని అనుకోలేం కదా!
పైగా, ఆంధ్రాలో టీడీపీని ఎంతగానో వ్యతిరేకించే కాంగ్రెస్.. తెలంగాణకు వచ్చేసరికి పొత్తు పెట్టుకుంటే.. ఆంధ్రాలో పూర్తిగా ఉనికి కోల్పోవాల్సిందే కదా! ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రా కాంగ్రెస్ పోరాడుతుంది. పోనీ, తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ తో పొత్తు సాధ్యమా.. అంటే, ఆ ఊహే అసాధ్యం. ఒకవేళ అదే పనిచేస్తే అది టీడీపికి ఇబ్బంది అవుతుంది కదా! ఆంధ్రాలో చంద్రబాబుతో వ్యతిరేకంగా పోరాడుతూ.. తెలంగాణలో చంద్రబాబుతో కలిసి పయనించడం అనేది జరిగితే కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది. కాబట్టి, కాంగ్రెస్ కోణం నుంచి ఆలోచిస్తే… టీడీపీతో ముందుకు సాగడం అనేది సాధ్యమయ్యేట్టుగా కనిపించడం లేదు. మరి, ఏ ధీమాతో రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొస్తున్నారో..! ఆయన విజన్ ఏంటో..?