తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడమే తెరాస లక్ష్యంగా మరోసారి కనిపిస్తోంది! అసెంబ్లీలో, గతంతో పోల్చితే సంఖ్యాబలం బాగా ఎక్కువగా ఉన్నా కూడా… ప్రతిపక్ష హోదా అనేది కాంగ్రెస్ కు లేకుండా చేయాలనే ప్రయత్నం తెర వెనక జరుగుతున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీంతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా లేకుండా చేయాలనే లక్ష్యంతో కూడా అధికార పార్టీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, నాగేశ్వరరావులను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సత్తుపల్లి నియోజక వర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సండ్ర వెంకట వీరయ్య. అయితే, ఇటీవలే ఆయనతో ఒక తెరాస ఎమ్మెల్యే చర్చలు జరిపారనీ, అయినా సండ్ర నుంచి సానుకూల సంకేతాలు రాలేదని వినిపిస్తోంది. ఆ తరువాత, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా రాయబారం నెరిపినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అప్పటికీ సండ్ర అభిప్రాయం మార్చుకోలేదనీ, దీంతో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లైన్లోకి వచ్చారనీ, సండ్రతో మాట్లాడారనీ, మంత్రి పదవి కూడా ఆఫర్ చేసేశారంటూ రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ప్రచారాన్ని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలూ ఖండించారు. తమకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. ఇదంతా తమపై జరుగుతున్న దుష్ప్రచారం మాత్రమే అన్నారు.
రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలనే బలమైన లక్ష్యం తెరాసది! అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే, ఈ ఆపరేషన్ కు నేరుగా తెరాస అధినాయకత్వమే రంగంలోకి దిగుతున్న పరిస్థితి. అయితే, ఈ నేపథ్యంలో ఈ ఇద్దర్నీ మరో ఐదేళ్లపాటు పార్టీ నుంచి బయటకి వెళ్లనీయకుండా చేయడంతోపాటు, టీడీపీ నుంచి బయటకి లాగడానికి జరిగే ప్రయత్నాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను కూడా పార్టీ తట్టుకోవాల్సి ఉంటుందనేది వాస్తవం. ఓరకంగా ఇది టీటీడీపీకి సవాలే. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ అసెంబ్లీలో ఈ ఇద్దరి వాయిస్ ను కాపాడుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉంది.