తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నట్లున్నాయి. పాలేరు ఉప ఎన్నికల పుణ్యమాని రకరకాల కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణాలో రాజకీయ శక్తుల పునరేకీకరణ అవసరం అని సీఎం కెసిఆర్ పిలుపు ఇచ్చారు. విపక్షాలను గులాబీ పార్టీలో విలీనం చేసుకోవడం అయన ఉద్దేశం కావచ్చు. కానీ అయన ప్రయత్నాలకు కౌంటర్ గా విపక్ష పార్టీల ఏకీకరణ కూడా జరిగిపోతున్నది. పాలేరు ఉప ఎన్నికలలో హడటం గుర్తుకు వోటు వేయాల్సిందిగా కోరుతూ కెసిఆర్ సర్కారు మీద తొడ కొట్టడానికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచార బరిలోకి దిగుతుండడమే ఇందుకు నిదర్శనం.
టీడీపీ, వైసీపీ పార్టీలు పాలేరులో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినప్పటికీ ప్రత్యక్షంగా ప్రచారంలోకి మాత్రం దిగలేదు. వారి చిత్తశుద్ధి గురించి కొందరు కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేసారు కూడా. అయితే ఇప్పుడు రేవంత్ స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. కెసిఆర్ సర్కారు మీద విమర్శలు అంటే, విరుచుకు పడిపోయే రేవంత్ ఈ ప్రచారంలో కూడా నిప్పులు చెరుగుతారని అనుకోవచ్చు. అయితే ఈ శ్రమ అంతా హస్తం పార్టీని గెలిపించడం కోసమే అని గుర్తు పెట్టుకోవాలి. నిన్న రాజోలిబండ వద్ద కాంగ్రెస్ దీక్షలో భాగం పంచుకోవడం , ఇవాళ రేపు పాలేరు ప్రచారానికి పూనుకోవడం అంతా కొత్త బంధాలకు సంకేతాలు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
రేవంత్ వచ్చాడు గనుక టీ వైసీపీ నేతలు కూడా కెసిఆర్ వ్యతిరేక ప్రచారానికి వస్తారో లేదా మనకెందుకు వచ్చిన పితలాటకం లెమ్మని మిన్నకుంటారో వేచి చూడాలి.