తెలంగాణలో తెలుగుదేశం పార్టీది ఒంటరి పోరాటమే అని ఒక నాయకుడు ప్రకటన చేస్తారు! లేదు లేదు.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ మిత్రులూ ఉండరనీ, తెరాస విషయంలో కూడా ఇది వర్తిస్తుందని మరో నాయకుడు చెప్తున్నారు. ఇంతకీ, తెలంగాణ తెలుగుదేశం ప్రస్తుతం ఏం జరుగుతోంది..? రేవంత్ రెడ్డి వెళ్లినా తమకేం నష్టం లేదనీ, పార్టీకి వచ్చే ఇబ్బందేం లేదని ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చే వరకూ పొత్తుల గురించి మాట్లాడే సంస్కృతి టీడీపీలో లేదని అంటారు! కానీ, అదే పొత్తుల విషయమై ఒక్కొక్కరు ఒక్కలా స్పందిస్తుంటారు.
నిజానికి, కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు కోసం రేవంత్ కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ప్రతిపాదనను సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. రేవంత్ అభిప్రాయాన్ని ఆయనే ముందుగా నిర్ద్వంద్వంగా ఖండించారు. రేవంత్ పార్టీ వీడిన నేపథ్యంలో టీడీపీ – తెరాసల మధ్య దోస్తీకి లైన్ క్లియర్ అయిందనే సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఈ అభిప్రాయాన్ని తెలంగాణ టీడీపీ నేతలు ఎవ్వరూ ఖండించలేదు.‘ అబ్బే.. కుదరదు’ అని వ్యతిరేకించలేదు. పైగా, దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సానుకూలంగానే ఉన్నట్టు మొదట్నుంచీ మాట్లాడుతున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఏ రాజకీయ పార్టీకీ మరో పార్టీతో శాశ్వత శత్రుత్వం ఉండదని అన్నారు, తెరాస విషయంలో కూడా ఈ కామెంట్ వర్తిస్తుందన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేం అంటూ.. తెరాసతో పొత్తుపై ఉన్న అవకాశాలను చెప్పకనే చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో… టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పొత్తు విషయమై మరో రకంగా మాట్లాడారు. నల్గొండలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీది ఒంటరి పోరాటమే అన్నారు. తెలంగాణలో పార్టీ చాలా బలంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులు పార్టీని వీడినా నష్టం లేదన్నారు. తమ శక్తి ఏంటో నిరూపించుకోవడం కోసం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమౌతున్నామన్నారు. అంటే, తెరాసతో పొత్తు ఉండదని ఆయన చెబుతున్నట్టే కదా.
తెరాసతో పొత్తుకు ఆస్కారం ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ చెబుతుంటే, ఒంటరిగానే పోరాటం అంటూ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి అంటున్నారు! అవసరాన్ని బట్టీ సమీకరణలు మారతాయని ఆయనంటారు. అలాంటి అవసరాలు ఉండవన్నట్టుగా ఈయన అంటారు. ఇంతకీ, ఎవరి మాట సరైంది..? పొత్తుల గురించి ఎన్నికలప్పుడు మాత్రమే ఆలోచిస్తామని, ఈలోగా దానిపై చర్చించడం తమ సంస్కృతి కాదని టీడీపీ నేతలే చెబుతుంటారు! మరి, ఇలా ఈ ఇద్దరు నేతలు పరస్పర విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి..? పొత్తుల గురించి రేవంత్ మాట్లాడితే… అది పార్టీ అధినాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని ఆనాడు చెప్పారు. మరి, మోత్కుపల్లి, రమణ మాటల్ని ఇప్పుడు ఎలా చూడాలి..? ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో కార్యకర్తలు గందరగోళానికి గురి అవుతారు కదా!