తెలంగాణలో తెలుగుదేశం ఉనికిని ఇప్పటి వరకూ కాపాడుతున్న అశ్వారావుపేట ఎమ్మెల్యె మెచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. గత ముందస్తు ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. మరొకరు.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఎన్నికల ఫలితాలొచ్చిన కొద్ది రోజులకే సండ్ర టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారికంగా చేరలేదు. అయితే ఆయన టీఆర్ఎస్ నేతగానే చెలామణి అవుతున్నారు. అప్పట్లోనే మెచ్చా నాగేశ్వరరావును కూడా పార్టీలో చేరాలని టీఆర్ఎస్ నేతలు ఆహ్వానించారు.
తనకు కేసీఆర్ ఏం కావాలన్నా ఇస్తానన్నారని.. కానీ తానే చేరదల్చుకోలేదని మెచ్చా నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. రెండేళ్లలోనే ఆయన మనసు మారింది. చడీచప్పుడు లేకుండా ఇప్పుడు నేరుగా… టీఆర్ఎస్లో చేరిపోయారు. టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేస్తూ.. లేఖను స్పీకర్‌కు ఇచ్చారు. దీంతో సండ్ర, మెచ్చా ఇద్దరూ పార్టీ ఫిరాయింపు అనే బాధ లేకుండా.. టీఆర్ఎస్లో కలిసిపోయినట్లవుతుంది. గతంలోనూ ఓ సారి టీడీఎల్పీని టీఆర్ఎస్ విలీనం చేసుకుంది. ఇది రెండో సారి.
తెలంగాణలో టీడీపీ రాను రాను బలహీనపడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ స్వయంగా పోటీ చేసినప్పటికీ.. కనీస ఓట్లు సంపాదించుకోలేకపోయారు. ఇక టీడీపీ ఉనికి కష్టమేనని అనుకుంటున్న సమయంలో మెచ్చా నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ తాను చూసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.