విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు వేసుకున్న అంచనాలు తలకిందులైనాయి. ఎన్నికల్లో ఓటమికన్నా శాసనసభ్యుల సామూమిక ఫిరాయింపులు కుదిపేశాయి. గతంలో రాజ్యసభకు ఆయన పంపిన వారంతా బయిటకు వెళ్లిపోయారన్న విమర్శ వుంది. ఇప్పుడు హైదరాబాదులో అక్షరాలా అదే జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఒకటి రెండు ఫిరాయింపుల నేపథ్యంలో నేను క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై ఆయనను ప్రశ్నించాను.’ వెళ్లే వాళ్లంతా వెళ్లిపోయారు. ఇక ఏం ఫర్వాలేదు’ అని జవాబిచ్చారు. కాని ఇప్పుడు నగరంలో మిగిలేవారెవరు అన్నదే ప్రశ్నగా వుంది. మంగళవారం టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వివేకానంద గౌడ్ ఒక దశలో టిటిడిపి అభివృద్ధి గురించి ఎన్నో ఆలోచనలు పంచుకునేవారు. రేవంత్‌రెడ్డిపై ఎంతో నమ్మకంతో హైదరాబాద్ ఫోరం వంటిది ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక అయనకు వుండేది. టీవీ చర్చలలోనూ గట్టిగానే వాదించేవారు. అయితే ఏవో ఆస్తి వివాదాలలో ఆయన చిక్కుకుపోవడం టిఆర్ఎస్ వైపు నడిపిందనేది ఒక కథనం చలామణిలో వుండింది. అయినా జిహెచ్ఎంసి ఎన్నికల ప్రకటన తరుణంలోనూ పార్టీని సమర్థిస్తూ మాట్లాడారు. మీరు కూడా టిఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వస్తాయని చెబితే ఇంకెలా అని సరదాగా అన్నారు. కొద్దోగొప్పో ప్రచారంలో వున్నాననిపించుకుని ఫలితాలు రాగానే దూకేశారు. ప్రేకాశ్ గౌడ్ కూడా చేరనున్నట్టు సమాచారం. రేవంత్ ఈ సమయంలో పార్టీ మారిన తమ వారిని అనకుండా పాలక పక్షంపైనే విమర్శ కేంద్రీకరించడం ఆశ్చర్యకరం. మరో శాసనసభ్యుడు గాంధీ తనకు పార్టీ మారే ఆలోచనలు లేవన్నట్టు గతంలో చెప్పారు గాని తనకూ టిఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలే వున్నాయన్నది తెలిసిన రహస్యమే. ఆ తర్వాత మిగిలేది నగర పార్టీ అద్యక్షుడు గోపీనాథ్. చూడాలి ఏమవుతుందో.. దగ్గరుండి చూస్తున్న లోకేష్ ఏం చేస్తారో..? పనులు జరగడం లేదు గనక వెళ్తున్నట్టు వీరంతా చెబుతున్నారు గాని వాస్తవానికి తెలుగుదేశంపై నమ్మకం సడలటం వల్లనే వెళ్లిపోయారన్నది తెలిసినవారి మాట. రేపు నారాయణ్ఖేడ్లోనూ ఎలాగూ తీవ్ర పరాజయమే గనక తర్వాత మరిన్ని వికెట్లు పడిపోవనే పూచీ లేదు!