తెలంగాణ లో ప్రస్తుతం టీడీపీ పరిస్థితిని చూస్తోంటే జాలి కలుగుతోంది. ఒకవైపు పాలేరు ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక. పార్టీ తరఫున బరిలోకి దిగకపోతే పరువునష్టం. బరిలోకిదిగితే, గెలుపు దక్కుతుందనే గారంటీ ఏమాత్రం లేదు. ఇప్పటికే మూతగట్టుకుంటున్న వరుస ఓటములకు మరొకటి తోడూ అయితే, అది కూడా పరువు నష్టమే. ఎటు చూసినా పరువు దక్కుతుందనే నమ్మకం చిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం వారికీ ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారయింది. పాలేరు ఎన్నికల బరిలో దిగి తొడకొట్టాలా వద్దా అనే మీమాంస లో పాపం తెలుగుదేశం పార్టీ సతమతం అయిపోతున్నది.
ఉప ఎన్నిక కు నోటిఫికేషన్ రాగానే టీడీపీ లో కాస్త జోరు కనిపించింది. తమ కాండిడేట్ గ నమ నాగేశ్వర రావు పేరును కూడా తేల్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత వారికీ క్లారిటీ వచ్చినట్లు ఉంది. పైగా మరణించిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్యకు టికెట్ ఇచ్చాము గనుక తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ వారిని కూడా కోరుతోంది. నామా కూడా… అలాంటి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించడానికే సుముఖంగా ఉన్నట్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ బంతిని చంద్రబాబు కోర్టులో పడేసింది. అయన కూడా ఏమీ తేల్చకుండా వదిలేసారు.
మరొకవైపు కాంగ్రెస్ వినతి సిపిఎం నో చెప్పడం విశేషం. సిపిఎం నో చెప్పిన నేపథ్యంలో తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే, ఎన్నికలకు భయపడినట్లు తెరాస విమర్శలు భరించాల్సి వస్తుందని టీటీడీపీ ఆలోచన. కాంగ్రెస్ తో జతకట్టి కూడా తెరాస ను ఓడించలేకపోతే మరింతగా పరువు పోతుందనే భయం కూడా వారికీ ఉంది. ఇన్ని రకాల భయాల మధ్య టీటీడీపీ పాలేరు పోటీ గురించి ఆదివారం నిర్ణయం తీసుకోబోతున్నది. ఇది వారికీ కత్తి మీద సాము లాంటి పనే అనడంలో సందేహం లేదు.