తెలంగాణ లో టీటీడీపీ, బీజేపీ పార్టీలు అసలు మిత్ర పక్షాలేనా అనే అనుమానం కలుగుతోంది. ఈ రెండు పార్టీలలో ఏ ఒక్కరు కూడా.. మిత్రధర్మం పాటిస్తున్న సూచనలు కనిపించడం లేదు. మరో కోణంలోంచి చూసినప్పుడు వీరిద్దరి మధ్య మిత్ర బంధం ఏనాడో మంటగలిసి పోయిందని అనిపిస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కూడా వీరి మధ్య బంధం పుటుక్కు మన్నదనడానికి నిదర్శనం గా నిలుస్తున్నది. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం కొంత ఓవర్ ఏక్షన్ చేసి, బీజేపీ ని విస్మరించి నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే… పాలేరులో తమకు మద్దతు ఇవ్వ వలసినదిగా కాంగ్రెస్, టీడీపీని సంప్రదించింది. అంతవరకూ ఓకే. టీడీపీ తమకు మిత్ర పక్షం గనుక బీజేపీ ని కూడా సంప్రదించి సమష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. వారు తమ పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడుకుని, అక్కడికి తమ సొంత నిర్ణయం వెలిబుచ్చేసారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే పాలేరు విషయంలో టీడీపీ తమను సంప్రదించలేదనే ఆరోపణ చేయకుండానే, తమ పాటికి తాము మరో నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది.
పాలేరులో పోటీ విషయం కేంద్ర నాయకత్వంతో మాట్లాడి చెబుతాం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. అంటే టీడీపీని వారు లెక్కలోకి తీసుకోవడం లేదని స్పష్టంగా అర్ధం అయిపోతున్నది. నిజానికి ఈ రెండు పార్టీలు ఎవరికీ వారే అన్నట్లు వ్యవహరించడం మునిసిపల్ ఎన్నికల్లోనే తేలిపోయింది. మిత్రబంధం అనేది ఏనాడో గాలికి కొట్టుకు పోయినట్లున్నది. వారుగా తమ పార్టీలు విడిపోయినట్లు అధికారిక ప్రకటన చేయలేదు గనుక మనం మిత్రులు అనే భ్రమలో ఉండాల్సిందే తప్ప, అసలక్కడ అలాంటి సూచన లేదని అంతా అంటున్నారు. పాలేరు విషయంలో మాత్రం టీటీడీపీ నే తప్పు చేసిందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.