ఈతరం దర్శకులు చాలా రకాల జోనర్లు ట్రై చేస్తున్నారు. మనకు తెలియని కొత్త కథలూ పుట్టుకొస్తున్నాయి. కానీ మనవైన బంధాల్ని, అనుబంధాల్ని, కుటుంబ కథల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా అంటే – కొత్తగా ఆవిష్కరించడం చాలా కష్టం. కానీ.. రకరకాల జోనర్ల మధ్య ఓ కుటుంబ కథా చిత్రమ్ వస్తే – పాత కథే అయినా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ప్రతీసారీ వెరైటీ ట్రై చేసే నాని లాంటి హీరో.. ఇప్పుడు.. ఈ సమయంలో ఓ ఫ్యామిలీ డ్రామాకి ఓటేశాడంటే దానికి కారణం కూడా అదే కావొచ్చు. నిన్ను కోరి, మజిలీ లాంటి క్లీన్ సినిమాలు తీసిన శివ నిర్వాణ ఈసారి సంపూర్ణ కుటుంబ కథ రాసుకున్నాడంటే – ఇందుకే అనుకోవొచ్చు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమానే `టక్ జగదీష్`. థియేటర్లోనా, ఓటీటీలోనా? అంటూ చాలా కాలంగా ఊగిసలాడిన టక్ జగదీష్.. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్‌లో వచ్చేసింది. మరీ జగదీష్ ఎలా ఉన్నాడు? ఆ టక్కు కథేమిటి?
STORY :
ఆది శేషగిరి నాయుడు (నాజర్)ది పెద్ద కుటుంబం. తనకు ఇద్దరు కొడుకులు, బోస్ (జగపతిబాబు), టక్ జగదీష్ (నాని). కొడుకులు, కూతుర్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతుంది. కానీ ఆ ఊర్లో మాత్రం నిత్యం భూతగాదాలే. ఎం.ఆర్.ఓ గా ఎవరొచ్చినా వాళ్లని బెదిరించో, భయపెట్టో తమ పనుల్ని చేయించుకుంటుంది భూపతి కుటుంబం. భూపతి కుటుంబానికీ నాయుడు కుటుంబానికీ అస్సలు పడదు. కొన్ని అనూహ్యమైన పరిణామాల మధ్య అదే ఊర్లో ఎం.ఆర్.ఓ గా టక్ జగదీష్ అడుగుపెడతాడు. ఆ ఊరి సమస్యల్ని ఓ కొలిక్కి తీసుకొస్తాడు. అయితే ఆ క్రమంలో.. పచ్చగా కళకళలాడుతున్న కుటుంబం ముక్కలవుతుంది. ఆ కుటుంబాన్నీ జగదీషే సరిదిద్దుతాడు. అదెలా? ఏమా కథ? అన్నది టక్ జగదీష్ లో చూడాలి.
చిన్న చిన్న కథలు పట్టుకుని సినిమాలు తీసేస్తున్నారు ఈతరం దర్శకులు. కానీ శివ నిర్వాణ మాత్రం చాలా పెద్ద కథ వేసుకున్నాడు. ఈ కథలో అనేకమైన సంఘర్షణలు, పొరలు కనిపిస్తాయి. ఎన్నో పాత్రలు వచ్చేస్తుంటాయి. ప్రతీ పాత్రకూ ఓ జస్టిఫికేషన్ ఇస్తూ.. ప్రతీ సంఘర్షణనీ విడమర్చి చెప్పుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశాడు. కుటుంబం, ఆస్తి తగాదాలు, ఊర్లో భూ గొడవలు అంటే… మరీ కొత్తగా ఏం ఉండవు. ఎప్పటి నుంచో వింటున్న, చూస్తున్న కథలే. టక్ జగదీష్ కూడా అంతే.
కానీ ఈ కథపై దర్శకుడు మోసిన బరువులు చాలా ఉన్నాయి. ఇంట్లో అన్నదమ్ముల గొడవ, ఊర్లో భూ తగాదాలు, మేనకోడలు బాధ్యత, పైగా ఎం.ఆర్.ఓ ఉద్యోగం, తనకో ప్రేమ కథ… ఇలా చాలా పనులు పెట్టుకున్నాడు. దాంతో స్క్రిప్టే ఊపిరి సలపనంత బరువుగా అయిపోయి ఉంటుంది. నిజానికి ఇన్ని లేయర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. సినిమా అయిపోతున్నా.. కొత్త పాత్ర (మేనమావ) పాత్రని ప్రవేశ పెట్టి, ఇంకా ఏదో చెప్పాలని చూశాడంటే – శివ నిర్వాణ ఎంత సాహసం చేశాడో ఊహించుకోవొచ్చు. ఈ కథ ముందు నుంచీ సీరియస్ టోన్ లోనే మొదలవుతుంది. కాకపోతే.. కుటుంబం అంతా ఒకే చోట ఉండడం, వాళ్ల మధ్య అనుబంధాలూ చూసి… గ్రూప్ ఫొటో చూసినంత సంబరం కలుగుతుంది. తండ్రి పాత్ర (నాజర్) చనిపోవడం దగ్గర ఓ ట్విస్టు వస్తుంది. అక్కడి నుంచి… కథ మరింత సీరియస్ గా అయిపోతుంది. అక్కడి నుంచి రకరకాల ఎమోషన్లు. ఈ దోవలో చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. కార్తీ చినబాబు దగ్గర్నుంచి, జగపతిబాబు నటించిన శివరామరాజు వరకూ… చాలా కథలు వెంటాడతాయి. కథ, ఎమోషన్లు పాతవే. కానీ.. నటీనటులు కొత్త. అలా అనుకుని సర్దుకుపోవాలి.
మేనకోడలితో హీరోకి ఉన్న అనుబంధం, మేనకోడలికి తానిచ్చే విలువ, ఆమెపై తన ప్రేమని చూపించిన విధానం ఇవన్నీ కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఆమె చేతికి ఓ చిన్న రిమోట్ ఇచ్చి.. `నీకు బాధొచ్చినప్పుడు బల్బు వెలిగించు` అని చెప్పడం, ఆ లైటు ఎప్పుడు వెలుగుతుందా అని హీరో కాపుకాచుకుని కూర్చోవడం ఇవన్నీ అచ్చమైన ఫ్యామిలీ ఎమోషన్లు. కాకపోతే సెల్ఫోన్ల రోజుల్లో కూడా ఈ స్విచ్చులూ, బల్బులూ ఎందుకూ అనుకుంటే మాత్రం ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు.
జగపతిబాబు పాత్రలో వచ్చిన మార్పు కాస్త కృత్రిమంగా ఉంటుంది. ఆ తరవాత.. ఇంట్లో వాళ్లంతా నానిని శత్రువులా చూడడం, అంతలోనే కలిసిపోవడం ఇవన్నీ కూడా అలానే అనిపిస్తాయి. కాకపోతే దర్శకుడు జగదీష్ పాత్రని బాగా ప్రేమించేశాడు. జగదీష్ లాంటి అబ్బాయి ప్రతీ ఇంటికీ ఉండాలి.. అని ప్రేక్షకులు అనుకోవాలి అన్నంతగా ఆ పాత్రని రాసుకున్నాడు. దాని చుట్టూ ఎమోషన్లు కూడా పేర్చుకుంటూ వెళ్లాడు. తన త్యాగాలు చూపించాడు. కాకపోతే.. ఆ ఎమోషన్ సీన్లు కొన్నిసార్లు పండాయి. కొన్నిసార్లు లేదు. నాజర్ కి ఇద్దరు భార్యలు, బోసు, జగదీషూ.. రెండో భార్య కొడుకులు. అన్న పాయింట్ చాలా బలమైనది. దాన్ని కొన్ని డైలాగులతో ప్రేక్షకులకు కన్వే చేసేశాడు తప్ప అర్థం చేసుకొనేలా చెప్పలేకపోయాడు.
నాని ఇలాంటి పాత్ర ఒప్పుకోవడం, ఈ కథని భుజాన వేసుకోవడం నిజంగా సాహసమే. ఎందుకంటే నాని అంటే ఎనర్జిటిక్ నటనే కనిపిస్తుంది. ఎంత సీరియస్ ఎమోషన్ అయినా.. ముందు కామెడీ చేసి, ఆ తరవాత ఎమోషన్లో దించేయడం నాని స్టైల్. నాని నుంచి ఆశించేది వినోదం. అయితే ఆ వినోదం ఈసినిమాలో మిస్ అయ్యింది. చాలా బరువైన పాత్రని అవలీలగా పోషించేశాడు గానీ, తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అది ఇవ్వలేకపోయాడు. పైగా కొన్ని చోట్ల అండర్ ప్లే చేయడానికి కొంచెం కష్టపడ్డాడేమో అనిపిస్తోంది. తనలో ఫ్రీనెస్.. కాస్త తగ్గింది. బహుశా.. ఈ పాత్ర ఇంతే డిగ్నిఫైడ్ గా చేయాలి అనుకుని ఉంటాడు. జగపతిబాబు పాత్రలోనూ రెండు మూడు కోణాలు కనిపిస్తాయి. ఏం చేసినా తనలోని విలనిజమే నచ్చుతుంది. రావు రమేష్, నరేష్ ఇద్దరూ మేటి నటులే. వాళ్లు తమ పరిధి మేర చేసుకుంటూ వెళ్లిపోయారు. రీతూ వర్మ కంటే ఐశ్వర్య రాజేష్‌కే పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం దక్కింది.
Verdict :
విజువల్ గా గ్రాండ్ గా ఉంది టక్ జగదీష్. పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించారు. పాటలు మరీ అంత ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. శివ నిర్వాణ సంభాషణలు బాగుంటాయి. సహజంగా అనిపిస్తాయి. ఇందులో సహజత్వానికే పెద్ద పీట వేశాడు. ఎమోషన్ సీన్స్ లో తన మాటలు బాగున్నాయి. కథకుడిగా శివ నిర్వాణ పాస్ అయిపోయాడు. కానీ.. ఇంత పెద్ద కథని తాను మోయలేకపోయాడేమో అనిపిస్తుంది. కాకపోతే.. ఓటీటీలో వచ్చిన సినిమా. ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా రోజులైంది. కాబట్టి ఇంటి పట్టునే ఉండి, చూస్కోవడానికి మాత్రం ఢోకా లేదు.
Telugu360 Rating 2.5/5