టాలీవుడ్ లోకి మరో యంగ్ హీరో వచ్చాడు. తనే… రోషన్ కనకాల. సుమ, రాజీవ్‌ల వారసుడు. తన తొలి చిత్రం ‘బబుల్ గమ్’ రేపు విడుదల అవుతోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన కుర్రాడు కావడంతో త్వరగానే జనం దృష్టిలో పడిపోయాడు. దానికి తోడు ‘బబుల్ గమ్’ కంటెంట్ కుర్రాళ్లకు నచ్చేలా ఉంది. ప్రమోషన్లకూ లోటు లేదు. ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్లూ వేస్తున్నారు. టాక్ బాగుంటే, ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడం ఖాయంగానే కనిపిస్తోంది.
అయితే రోషన్‌కు ఈ ప్రయాణం అంత ఈజీ కాకపోవొచ్చు. ఎందుకంటే యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ ఉంది. ఇది వరకు కుర్ర హీరోలు నటన, డాన్స్‌లతో మెప్పిస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. సమ్ థిమ్ ఇంకేదో కావాలి. సిద్దు జొన్నల గడ్డ, నవీన్ పొలిశెట్టి లాంటి హీరోల ఎనర్జీ ముందు సరితూగాలి. అల్ట్రా మోడ్రన్ కుర్రాళ్లకు నచ్చే క్యారెక్టర్లు చేయాలి. అలాగని ఫ్యామిలీ ఆడియన్స్‌ని వదులుకోకూడదు. ఇన్ని విషయాల్లో సమతూకం పాటించడం అంత ఈజీ కాదు. ప్రచార చిత్రాల్లో, ఫంక్షన్లలోనూ రోషన్ ఎగ్రసీవ్గానే కనిపిస్తున్నాడు. సుమలా మాటకారే. తన రంగు గురించి మాట్లాడిన వాళ్లకు కౌంటర్ ఇస్తూ.. తన పంథా ఎలాంటిదో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పేశాడు. ఇక్కడున్న పోటీ గురించి కూడా బాగానే అవగాహన చేసుకొన్నట్టు కనిపిస్తోంది. ”నేను ఎవరికీ పోటీ కాదు. పోటీలో ఉండాలని ఇక్కడకి రాలేదు. నటన అంటే నాకు ఇష్టం. ఆ ప్యాషన్‌తోనే సినిమాల్లోకి అడుగు పెట్టా. ఇక్కడ ప్రతీ ఒక్కరికీ స్థానం ఉంది. బాగుంటే సినిమాలో హీరో ఎవరనేది కూడా చూడకుండా ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే హీరో అయ్యా” అని చెబుతున్నాడు రోషన్. మరి హీరోగా తన అరంగేట్రం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.