ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. షర్మిల ముందున్న మొదటి టార్గెట్ రాబోయే జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న నమ్మకాన్ని కలిగించడం. అందు కోసం ప్రభావవంతమైన ఓటు షేర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే జీరో పొజిషన్లో ఉంది. ఆ పార్టీ పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఎంత వచ్చినా వచ్చినట్లే. అయితే షర్మిల పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని షర్మిల బలం పెంచుకుంటేనే ఆమె రాజకీయ జీవితానికి కంటిన్యూటి ఉంటుంది.
ఇప్పటికే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పార్డీని నడిపినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పేరుతో పోటీ నుంచి విరమించుకోవడం వ్యూహాత్మక నిర్ణయం. అక్కడ పోటీ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చినా ప్రభావం ఉండేది కాదు. అక్కడ పోటీ చేయకపోవడం వల్ల ఏపీలో రాజకీయ భవిష్యత్‌ను షర్మిల కాపాడుకోగలిగారు.
ఏపీలో రాజకీయాలు చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారంటే.. అన్నింటికీ సిద్ధపడి ఉంటారని అనుకోవాలి. తాను తలపడబోయే ప్రత్యర్థుల్లో కుటుంబసభ్యులు ఉంటారు. సొంత సోదరుడు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతోనే ఆమె ఎక్కువ పోరాటం చేయాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచే ఓటు బ్యాంక్ వెనక్కి రావాల్సి ఉంది. ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం.
షర్మిల తీసుకున్న టాస్క్ చిన్నది కాదు. అతి తక్కువ సమయంలోనే తన ప్రభావాన్ని ఏపీలో చూపించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ మరో నెల.. నెలన్నరలో వస్తుందన్న ప్రచారం ఉంది. పార్టీని బలోపేతం చేసి తాను బలోపేతం కావాల్సిన క్లిష్టమైన చాలెంజ్ ను షర్మిల తీసుకున్నారు. ఎంత వరకూ ఈ విషయంలో పలితాలు సాధిస్తారనేది.. ఎన్నికల ఫలితాల తర్వాతే తేలుతుంది. గెలుపోటముల్ని మార్చే అంత ఓటింగ్ శాతం సాధిస్తే.. షర్మిలకు తిరుగులేని రాజకీయ భవిష్యత్ ఉంటుందని అంచనా వేయవచ్చు.