ఎట్టి పరిస్ధితుల్లోనూ జూన్ 27 నుంచి అమరావతిలో సెక్రటేరియట్ పనిచేయవలసిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. అది అమలౌతుంది కూడా. అయితే ఉద్యోగుల హాజరు ఎంత వుంటుంది? అది ఎప్పటికి మెరుగౌతుంది? అన్నదే అసలు ప్రశ్న! హెచ్చుమంది ఉద్యోగులు కుటుంబాలను హైదరాబాద్ లోనే వుంచేసి వారు మాత్రమే అమరావతి వచ్చే అవకాశం వుంది.
వారానికి ఐదురోజులే పని, విజయవాడ – హైదరాబాద్ ల మధ్య ఫ్రీ బస్ పాస్, ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్ళకు పెంపు మొదలైన సదపాయాలు సెక్రటేరియట్ ఉద్యోగులను ఆకర్షించలేకపోతున్నాయి.
ముఖ్యంగా నడివయసు ఉద్యోగులలో పిల్లల చదువు, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలు, సంవత్సరాల తరబడి హైదరాబాద్ తో పెనవేసుకుపోయిన సాంఘిక, వ్యక్తిగత జీవితాలు ఆ నగరం నుంచి ఏ సదుపాయమూ లేని అమరావతి రావడానికి అడ్డుపడుతున్నాయి. దీంతో ఎంతో ఖర్చుకాగల రాయితీలు ఇచ్చినా ప్రయోజనం వుండదేమోనన్న ఆందోళన ఉన్నతాధికారుల్లో వుంది.
వారానికి ఐదురోజులే పని కావడం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. ఏడాదికి 52 ఆదివారాలు, 52 శనివారాలు కలిపి 104 రోజులు సెలవులుగా పోతాయి. 14 పండుగ సెలవులు ఉన్నాయి. ఇవికాక 3 జాతీయ సెలవులు కలిపి 176 రోజులు. ఇవికాక ఐచ్చిక సెలవులు,ఆర్జిత సెలవులు, అనారోగ్య సెలవులు మరో 84రోజులు. అమరావతికి రావడంలో ఇబ్బందుల వల్ల ఉద్యోగుల్లో హెచ్చు మంది మొత్తం సెలవుల్ని వాడేసుకునే అవకాశం వుంది. ఇవన్నీ పోను పనిరోజులు ఏడాదికి 155 మిగులుతున్నాయి.
హెచ్చుమంది ఉద్యోగులు కుటుంబాలను హైదరాబాద్ లోనే వుంచేసి వారు మాత్రమే అమరావతి వచ్చే అవకాశం వుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ మాదిరిగా ఉద్యోగులకు కూడా క్వార్టర్స్, లేదా హాస్టల్స్ ఏర్పాటు చేసి సబ్సిడి ధరలతో భోజన, వసతులు ఇస్తే పరిస్ధితి కొంత మెరుగు పడే అవకాశం వుంది.