తులసి రెడ్డి.. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటి కాదు కానీ…తన మాటతీరుతో, వాక్చాతుర్యంతో తన ప్రత్యేకతను నిరూపించుకొంటూ వస్తున్న వ్యక్తి. ఇప్పటికే పలు పార్టీలు మారిన నేపథ్యం కూడా ఉంది ఈయనకు. తెలుగుదేశంతో మొదలుపెట్టి.. భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ.. అటు నుంచి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చాడు తులసి రెడ్డి. తెలుగుదేశంలో కూడా పదవులు అనుభవించాడు.. ఆపై కాంగ్రెస్ లో చాలా కాలమే పనిచేశాడీయన.
కాంగ్రెస్ లో వైఎస్ ఆర్ హయాంలో పూర్తిగా ఆయనకు అనుకూలంగా వ్యవహరించాడీయన. అయితే వైఎస్ మరణానంతరం మాత్రం ఈయన ప్రాధాన్యతలు మారిపోయాయి! వైఎస్ మరణానంతరం జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో జగన్ పై విమర్శలు మొదలుపెట్టాడు తులసిరెడ్డి. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు దగ్గరయ్యాడీయన. ఆ వెంటనే అధిష్టానం రోశయ్యను తప్పించి.. కిరణ్ ను ముఖ్యమంత్రిగా చేయగానే.. ఆ శిబిరంలో చేరాడు తులసి రెడ్డి. కిరణ్ కు అనుకూలంగా ఒక రేంజ్ లో భజన చేస్తూ.. జగన్ పై దుమ్మెత్తిపోశాడు తులసి రెడ్డి. దీనికి ప్రతిఫలంగానేమో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు పదవి ఒకటి దక్కింది. దాన్ని ఎంజాయ్ చేస్తూ.. వైసీపీపై అప్పట్లో గట్టి విమర్శలు చేశాడు తులసి రెడ్డి.
మరి వైసీపీని విమర్శిస్తే.. ఒక వర్గం మీడియాలో సదరు వ్యక్తికి బాగా ప్రాధాన్యత దక్కుతుంది కదా.. అందుకే, తులసి రెడ్డిని ఈటీవీ వాళ్లు, ఏబీఎన్ వాళ్లు బాగా ఆదరించారు. తమ చర్చా కార్యక్రమాల్లో తులసి రెడ్డి ని తప్పనిసరిగా కూర్చోబెట్టే వాళ్లు ఈ ఛానళ్ల వాళ్లు. మరి ఇప్పుడు తులసి రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరిపోయాడు.. కాంగ్రెస్ నేతగా చంద్రబాబును విమర్శిస్తున్నాడు. అంతే.. తులసి కి ఆ ఛానళ్ల నుంచి ఆహ్వానాలు లేకుండా పోయాయి! అయితే ఇప్పుడు తులసి రెడ్డికి ఒక వేదిక అయితే లభించింది. అది సాక్షి టీవీ. ఒకప్పుడు సాక్షిని తులసి రెడ్డి బాగా విమర్శించాడు. ఇప్పుడు మళ్లీ ఆయన ఆ టీవీ చర్చా కార్యక్రమంలో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.