ఇదే పరిణామాలపై గురువారం ఎన్టివి చర్చలో పాల్గొన్నప్పుడు బిజెవైఎం నాయకుడు రమేష్ రెడ్డి, ఎఐఎస్ఎప్ నాయకుడు శంకర్ తమ తమ వాదనలు వినిపించారు. సహజంగానే వాదోపవాదాలు కూడా జరిగాయి. కాని ఎపి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా.తులసిరెడ్డి మాత్రం కన్నయ్య కుమార్ ఇక్కడకు రావడమే తప్పని ఆరోపించడం ఆశ్చర్యం కలిగించింది. విసి అప్పారావు తిరిగితీసుకురావడం పొరబాటని అంటూనే విద్యార్థులు విద్వంసానికి పాల్పడితే పోలీసులు వూరుకుంటారా…అని ఎదురుదాడి చేశారు. మీ పార్టీ ఎంఎల్ఎ సంపత్ కుమార్ కూడా అరెస్టయినాడు గదా? రాహుల్ గాంధీ కూడా వచ్చి వెళ్లారు కదా? ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ వైఖరా? అంటూ అటూ ఇటూ కాకుండా మాట్లాడారు. కొంతకాలం బిజెపిలోనూ, చాలా కాలం తెలుగుదేశంలోనూ వున్న తులసి రెడ్డి ఆ ప్రభావాలు ప్రదర్శించారా అన్న సందేహం కలిగింది. అసలు విద్యార్థి సంఘాలే వుండకూడదని కూడా ఆయన వాదించడం విచిత్రం.