మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చాల పకడ్బందీ వ్యూహాన్నే సిద్ధం చేసారు. తన ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా సరే అప్రతిహత విజయ పరంపర తో దూసుకుపోతున్న కెసిఆర్, కాంగ్రెస్ పార్టీ కి బలమైన, ప్రస్తుతం సానుభూతి పవనాలు కూడా తోడుగా ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి తిరుగులేని వ్యూహంతో సిద్ధం అయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీకి, ఇప్పటికే మంత్రిగా, ఎమ్మెల్సీ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పేరును ఖరారు చేసారు. దీనితో ఖమ్మం జిల్లా పాలేరు రాజకీయం రసకందాయంలో పడినట్లే!
పాలేరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి గెలిచి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా అయ్యారు. ఇటీవల అయన అనారోగ్యంతో మరణించారు. ఆ నేపథ్యంలో ఇపుడు పాలేరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే కెసిఆర్ అభ్యర్థిని ప్రకటించేశారు. ఫార్మ్ హౌస్ లో ఉన్న సీఎం హడావిడి గా నగరానికి వచ్చి అభ్యర్థి ప్రకటన చేయడం విశేషం.
తమ ప్రభుత్వ హయాంలో ఏ ఒక ఎన్నికను కూడా వదలిపెట్టకుండా గెలుపు పరంపరను కొనసాగించాలని కెసిఆర్ చాల కృతనిశ్చయంతో ఉన్నారు. తుమ్మల పేరును ప్రకటించడం వెనుక కూడా అదే వ్యూహం ప్రస్ఫూటం అవుతోంది. ఖమ్మం జిల్లాలో తెరాస పార్టీ కంటే వ్యక్తిగా తుమ్మలకు ఉన్న బలం ఎక్కువ. ఆయనను పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చిన తరువాతే… తెరాస అక్కడ బలపడడం మొదలైంది. అందుకే ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను పనిగట్టుక్కుని ఎమ్మెల్యే బరిలోకి దించుతున్నట్లు తెలుస్తున్నది. సామాజిక వర్గ సమీకరణాలు, బలాలు చూసినా తుమ్మల అభ్యర్థి అయితే అడ్వాంటేజ్ ఉంటుందని తెరాస భావిస్తున్నది. అందుకే, కేటీఆర్ ఈ ప్రతిపాదన తెచ్చిన వెంటనే తుమ్మల కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ ని విజయపథాన నడిపించిన కేటీఆర్ పాలేరు లో కూడా ఎన్నికల బాధ్యతను భుజానికెత్తుకొనున్నారు.