ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మహర్దశ పట్టుకుంది. బలమైన నేతలంతా వచ్చి చేరుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి చేరుతున్నారు. ఇప్పటి దాకా బీఆర్ఎస్ కు బలంగా ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. పాలేరు టిక్కెట్ ను తనపై స్వల్ప తేడాతో గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డికి కేటాయించడంతో తుమ్మల అసంతృప్తికి గురయ్యారు. తనకు ఏ ప్రత్యామ్నాయం చూపించే ఆలోచన కేసీఆర్ చేయకపోవడంతో… పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే బలప్రదర్శన చేసిన ఆయన.. కాంగ్రెస్ తో చర్చలు పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ లోని తుమ్ముల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి..ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం ఉండటంతోనే వారిని తన నివాసానికి తుమ్మల ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి, మల్లు రవి కూడా ఉన్నారు. వారందరినీ తమ్ముల నాగేశ్వరరావు శాలువాలతో సన్మానించారు. పాలేరు నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అయితే పాలేరు నుంచి పోటీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు.
దీంతో ఖమ్మం సిటీ లేకపోతే.. కూకట్ పల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన వరకూ టీడీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లోచేరారు. అయితే జిల్లా మొత్తంపై పెత్తనం ఇచ్చినా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కావడం.. తాను స్వయంగా ఓడిపోవడంతో.. ఆయనను కేసీఆర్ పట్టించుకోవడం మానేశారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.