తెలంగాణలో చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకునేందుకు ఒకప్పటి ఆయన సన్నిహితులు కూడా ఏ మత్రం మొహమాటపడటం లేదు. ఖమ్మం నియోజకవర్గంలో తాను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గెలిచినట్లేనని తుమ్మలు చెప్పుకొచ్చారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే తన ఆలోచన అని అన్నారు. తెలుగుదేశం పార్టీకి తాను చాలా రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలి కాలంలో టీడీపీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు.
ఖమ్మం టీడీపీ ఆఫీసుకు కూడా వెళ్లారు. ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి ఉన్న కేడర్ బలాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. అయితే ఖమ్మంలో ఈ సారి ఏపీలో పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేన కూటమి లో పార్టీ అయిన జనసేన పోటీ చేస్తోంది. బీజేపీ మద్దతు ఇస్తోంది. అధికారికంగా టీడీపీ మద్దతు ఇవ్వడం లేదు. కానీ ఏపీలో పొత్తులు ఉన్నందున తమకే ఓటు వేయాలని.. టీడీపీ నేతల్ని జనసేన నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో టీడీప సానుభూతిపరుల ఓట్లు చేజారిపోకుండా తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ కు సంస్థాగతంగా బలం ఉంది. టీడీపీ సానుభూతిపరులు కూడా కలసి వస్తే విజయం ఖాయమని అంచనా వేసుకుంటున్నారు.
ఖమ్మంతో తుమ్మలకు సుదీర్ఘమైన అనుబంధం కూడా ఉంది. జిల్లాలోనే అత్యంత సీనియర్ నేత , జిల్లా అభివృద్ధి కోసం ప్రయత్నించిన నేతగా ఆయనకు పేరు ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు.