ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో ఎప్పుడు ఏ లీడర్ ఉంటారో .. ఊడతారో తెలియని పరిస్థితి . అందరూ సీనియర్లే. అందరికీ బలమైన వర్గం ఉంది. కానీ కేసీఆర్ అందరికీ ప్రాధాన్యం ఇవ్వలేని పరిస్థితి. అసలే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఏ లీడర్ ఎలాంటి అడుగు వేసినా అనుమానంగా చూసే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో .. తుమ్మల నాగేశ్వరరావు.. వాజేడులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనుచరులు తరలి వచ్చారు. కనీసం ఐదు వందల కార్లతో ర్యాలీ కూడా నిర్వహించారు.
తుమ్మల హడావుడి చూసి అందరూ .. ఆయన ఏదో పార్టీ మారబోతున్నారని అనుకున్నారు. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ఆయనతో మాట్లాడింది. అయితే తుమ్మల కూడా .. తన ఆత్మీయ సమావేశం నిజంగానే ఆత్మీయమైనదేనని.. రాజకీయం కాదని వారికి భరోసా ఇచ్చారు. అయినా వారిలో అనుమానం అలాగేఉంది. సమావేశంలో తుమ్మల కూడా కాస్త విధేయంగా.. కాస్త వింతగా మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని అందర్నీ కోరారు. తాను కూడా పార్ట మారడం లాంటివి చేయబోనన్నారు. అయితే సీతారామస్వామి ప్రాజెక్ట్ కోసమే కేసీఆర్తో పని చేస్తున్నానని ట్విస్ట్ ఇచ్చారు.
తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ముందుగా జరిగినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఖమ్మం జిల్లా నాయకులు.. తమ సీటును ఏదో ఓ పార్టీలో ఖరారు చేసుకోవాలనుకుంటున్నారు. తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్లో అలజడి కనిపిస్తోంది.