తెలంగాణా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇటీవల ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గం నుంచి తెరాస తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ తక్షణమే ఆమోదించారు. తుమ్మల నాగేశ్వర రావుకి ఖమ్మం జిల్లాపై మంచి పట్టుంది కనుకనే ఆయన ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉన్నపటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస అభ్యర్ధిగా బరిలో దింపారు. ఆయనను అభ్యర్ధిగా ప్రకటించినప్పుడే తెరాస విజయం దాదాపు ఖాయం అయిపోయింది. సాధారణంగా అధికారంలో ఉన్నవారు ఎవరైనా ఎన్నికలలో పోటీ చేయదలిస్తే, ముందుగా తమ పదవులకు రాజీనామా చేయడం ఒక సత్సంప్రదాయంగా పాటిస్తుంటారు. కానీ తుమ్మల నాగేశ్వర రావు ఆ సాంప్రదాయానికి కూడా తిలోదకాలు ఇచ్చేశారు. ఆయన మంత్రిగా, ఎమ్మెల్సీగా కొనసాగుతూనే శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. తద్వారా ఉప ఎన్నికలలో ఓడిపోతాననే అనుమానం, భయం ఆయనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పుకొనట్లయింది. ఆయన తన మంత్రి పదవికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగి ఉండి ఉంటే ఎంతో ఆయనకి, తెరాస పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఎంతో గౌరవంగా ఉండేది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం గొప్ప విషయమేమీ కాదు. అదొక అనివార్యత మాత్రమే.