ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం జరిగిన విద్వంసంలో అరెస్టయిన మొత్తం 13 మందిలో 10 మందికి శుక్రవారం సాయంత్రం పిఠాపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన వారందరూ రోజూ విధిగా పోలీస్ స్టేషన్లో హాజరు వేయించుకొని వెళ్లాలని, కోర్టు అనుమతి లేనిదే ఊరు విడిచి ఎక్కడికి వెళ్లరాదని షరతులు విధించింది.
అదే కేసులో ఒక నిందితుడికి కాకినాడలోని సిఐడి కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. రేపు మిగిలినవారి కస్టడీ కోసం పోలీసులు సిఐడి కోర్టుని అభ్యర్ధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈరోజు మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు నివాసంలో చిరంజీవి, దాసరి నారాయణ రావు, సి. రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు సమావేశమయ్యారు. ముద్రగడ పద్మనాభం పట్ల, ఆయన దీక్ష పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాపులను రెచ్చగొట్టే విధంగా మంత్రులు మాట్లాడటం సరికాదని, దాని వలన పరిస్థితులు ఇంకా విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అది యావత్ కాపు జాతిని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. ముద్రగడకి జరుగరానిది ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని హెచ్చరించారు. ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించి, తుని ఘటనలో అరెస్టయినవారిని అందరినీ తక్షణమే విడుదల చేయాలని కోరారు.
తుని కేసులో అరెస్ట్ చేసిన వారినందరినీ బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ ముద్రగడ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కానీ వారిలో 10 మందిని మాత్రమే పోలీసులు విడుదల చేశారు కనుక ఆయన తన దీక్షని యధాప్రకారం కొనసాగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముద్రగడ డిమాండ్లకి పూర్తిగా తలొగ్గినట్లు వ్యవహరించకుండా 10 మందిని మాత్రమే విడుదల చేయడంతో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.