తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల పేరుతో చిచ్చు పెట్టి ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్లాన్ ప్రకారం తగులబెట్టించారు కరడుగట్టిన రాజకీయ నేతలు. అంతేనా పోలీసులను వ్యక్తిగత ఆస్తులనూ వదల్లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఆ కేసులను వైసీపీ ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకుంది. రైల్వే పోలీసులు పెట్టిన కేసును తాజాగా కోర్టు కొట్టి వేసింది. ఎందుకంటే ఒక్క సాక్ష్యం కూడా లేదట.
అదేమిటి కళ్ల ముందే అన్ని సాక్ష్యాలున్నాయి కదా.. ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపులు కూడా ఉన్నాయి కదా.. వైసీపీ నేతల ప్రత్యక్షంగా ఇచ్చిన రెచ్చగొట్టుడు ప్రకటనలు ఉన్నాయి కదా అని చాలా మందికి డౌట్ రావొచ్చు.కానీ ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టు ముందు ప్రవేశ పెట్టలేదు. న్యయమూర్తే ఈ విషయం చెప్పారు. ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. అసలు నిందితులు 41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పేశారు.
ఈ కేసులో ప్రదానంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, వన్ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకరనాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ వంటి వారు ఉన్నారు. వారందరూ కేసు నుంచి బయట పడినట్లయింది. మొత్తంగా తుని రైలు ఘటనతో ఎవరి ప్రాణాలు పోలేదు కానీ.. పోయినంత పనైంది. ఓ అరాచకం రాజ్యమేలింది. అలా అరాచకం చేసిన వారంతా స్వేచ్చగా బయటకు వచ్చేశారు. అధికారవర్గాలు కుమ్మక్కు అయితే జరిగేది ఇదే. ఇక ప్రజలకు న్యాయంపై నమ్మకం ఎలా కుదురుతుంది ? అందరూ నిర్దోషులైతే రైలును ఎవరు తగులబెట్టినట్లు ?