2014 ఎన్నికల్లో ఎలాగైనా గెలవకపోతే రాజకీయ భవితవ్యం దుస్సాధ్యమనే అంచనాతోనే చంద్రబాబు నాయుడు ఎడాపెడా వాగ్దానాలు చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటర్లలో ప్రశ్నించే లక్షణం పెరిగిందన్న వాస్తవాన్ని ఆయన పూర్తిగా పట్టించుకోలేదు. ఒకసారి గద్దెక్కితే ఏదో ఒకటి చేయగలనని అంచనా వేసుకున్నారు. రిజర్వేషన్ల తేనెతుట్టెను కదలిస్తే ఒకపట్టాన పరిష్కారం దొరకదని తెలిసి కూడా వాగ్దానాలు చేశారు. వాటి అమలులో మాత్రం ఆలస్యం చేశారు. నిజంగానే బండి ముందు గుర్రం వెనక అన్నట్టు ముందు వాగ్దానాలు చేసి తర్వాత వాస్తవాలను ఏకరువు పెట్టడం తలకిందులు తర్కం వంటిది. కాపుల కోర్కెలపై ముద్రగడ పద్మనాభం వంటివారితో సవివరంగా చర్చించితే రాజకీయంగా లోబడిపోయినట్టు కనిపిస్తుందనుకున్నారే గాని -అరెస్టులు అణచివేతలు ఆగ్రహం అసంతృప్తి పెంచుతాయని ఆ వర్గం నేతలు చెప్పింది వినిపించుకోలేదు. రైలు, పోలీసు స్టేషన్ల ధగ్ధంతో అరాచక ముద్ర వేద్దామంటే తర్వాత వారు సంయమనం పాటించారు. వరసకట్టి తమ మంత్రులు ఎంఎల్ఎలతో మీడియా గోష్టులు పెట్టించినా అవి అక్కరకు రాలేదు. అంత భారీ సమీకరణ కార్యాచరణ తర్వాత అధికార పక్షం తరపున మాట్లాడే నేతలకు సహజంగానే ఆమోదం వుండదు. ముగ్గురు ఎంఎల్ఎలు రాయబారం వెళ్లినపుడు తాము ప్రభుత్వం తరపున రాలేదని ఒకటికి రెండుసార్లు చెప్పడంద్వారా భేషజం నిలుపుకున్నారేగాని మధ్యవర్తులం అనిపించుకోలేకపోయారు. వైసీపీ కూడా మొదట రోజు ఘటనతో విమర్శలకు గురైనా పరిస్థితి దిగజారుతున్నకొద్ది మద్దతుగా ముందుకొస్తున్నది. దాసరి నారాయణరావు వంటి వారు నేరుగా వస్తుంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ సోదరులు కూడా సానుకూల సానుభూతి వచనాలే వినిపించే పరిస్థితి తప్పనిసరి అవుతుంది. బీసీల ఆందోళనల్లో అర్థం వున్నా అధికార పార్టీకే వాటినీ అంటకట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాస్త అటూఇటూగా ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీస్తుందేగాని ఉపశమనం తీసుకురాదు. జస్టిస్ మంజునాథ్ మాటలు కూడా ఆలస్యాన్ని సూచిస్తున్నాయి గనక ఈ ఆందోళన దీర్ఘకాల రూపం తీసుకోవచ్చు. మొత్తంపైన కాపులతో మొదలైన ఈ అలజడి వేగంగా ఇతరులకు విస్తరించడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గమనం కొత్త మలుపు తిరగొచ్చు. అది చంద్రబాబుకు ప్రతికూలంగా వుండే అవకాశాలున్నంతగా అనుకూలమయ్యే పరిస్థితి వుండదు. 1988లో ఎన్టీఆర్ హయాంలోనే కాపునాడుతో మొదలై చివరకు ఓటమి వరకూ నడిపించిన సంగతి గుర్తుంచుకుంటే చంద్రబాబు ముందున్నది పెద్ద సవాలేనని అర్థమవుతుంది. చెప్పిందే చెప్పి కలవరపాటు పెంచుకోవడం కంటే సహేతుకమైన విధానంతో సామాజిక తరగతులను కలుపుకొని పోవడం విభజిత రాష్ట్రానికి మేలు చేస్తుంది.కులరాజకీయాలని వీటిని తిట్టిపోస్తే మొదలుపెట్టిందే మీరు కదా అనే ఎదురు సమాధానం వస్తుంది! బీసీల ఆందోళన ఆంతర్యం కూడా అదే అవుతుంది. అసలే అంతంతమాత్రంగా వున్న అధికార పక్షం అంతర్గత పరిస్థితి దీంతో మరింత ఒత్తిడికి గురవుతుంది. ఇప్పటికి గట్టెక్కినా సమస్య మాత్రం వెన్నాడుతుంది.