బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో అసుర అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ ముందుకుసాగుతున్న నారా రోహిత్. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న రోహిత్ ‘తుంటరి’ టైటిల్ తో ఓ మాస్ కమర్షియల్ చిత్రం చేసాడు. మాతృక తమిళ్ చిత్రం ‘మాన్ కరాటే’ కి రీమేక్. యూనివర్సల్ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ కథ ను అందించాడు. తొలి చిత్రం తోనే ‘గుండెల్లో గోదారి’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ కీర్తి ఫిలిమ్స్ పతాకంపై నాగార్జున, అశోక్ బాబా సంయుక్తంగా నిర్మించిన ‘తుంటరి’ ఈ రోజు విడుదలయ్యింది. ఈ సినిమా నారా రోహిత్ ని కమర్షియల్ హీరోల జాబితాలోకి చేర్చుతుందా.. ఈ సినిమాతో కుమార్ నాగేంద్ర సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ జాబితాలో చేరతాడా లేదో ఈ సమీక్ష లో తెలుసుకుందాం.
కథ:
కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజిత మంచి ఫ్రెండ్స్. సత్యం సాఫ్ట్ వేర్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్న ఈ ఐదుగురు కార్పోరేట్ ఉద్యోగులు సెలవులకు అనంతగిరి ఫారెస్ట్ కి పిక్నిక్ కి వెళతారు. అక్కడ ఈ ఐదుగురు ఓ సాధువును కలుస్తారు. అప్పుడు భవిష్యత్తు గురించి ఓ విషయం తెలుస్తుంది. నాలుగు నెలల తర్వాత జరగబోయే బాక్సింగ్ మ్యాచ్ లో రాజు (నారా రోహిత్) అనే వ్యక్తి గెలుస్తాడని సాధువు ద్వారా తెలుసుకుంటారు. ఆ రాజు ఆనందరావుగారి అబ్బాయి అని కూడా తెలుసుకుంటారు. దాంతో బాక్సింగ్ మ్యాచ్ విన్నర్ కి వచ్చే ఐదు కోట్ల ప్రైజ్ మనీ కోసం ఆ రాజును వెతికి పట్టుకోవాలని డిసైడ్ అవుతారు. చిన్నప్పట్నుంచి చదువు సంధ్య లేకుండా, పెద్దయిన తర్వాత పనిపాటా లేకుండా గాలికి తిరిగే లోకల్ రాజును కిశోర్ బ్యాచ్ పట్టుకుంటుంది. ఇతనే బాక్సింగ్ లో గెలవబోయే కుర్రాడని భావించిన కిశోర్ బ్యాచ్ అతనికి నెల నెల జీతం ఇచ్చి, బాక్సింగ్ కి ప్రాక్టీస్ కోసం డబ్బు కూడా ఖర్చుపెడతారు. అయితే రాజు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకుండా సిరి (లతా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. ఆమె వెనకాల పడుతూ ఆమె ప్రేమను గెల్చుకుంటాడు. ఆ సమయంలోనే టాప్ బాక్సర్ పేరు కూడా రాజే (కబీర్ దూహన్ సింగ్) అని కిశోర్ బ్యాచ్ కి తెలిసి షాక్ తింటారు . అతని తండ్రి పేరు కూడా ఆనందరావు అని తెలియడంతో బాక్సింగ్ టోర్నమెంట్ లో గెలవబోయే రాజు ఎవరనే సందేహం కిశోర్ బ్యాచ్ కి కలుగుతుంది. మరి ఫైనల్ గా బాక్సింగ్ లో గెలిచిన రాజు ఎవరు? ఇంతకి సాధువు చెప్పిన రాజు ఎవరు? అతని ద్వారా కిశోర్ బ్యాచ్ తెలుసుకున్న భవిష్యత్తు నిజమేనా? సిరి, రాజు ప్రేమ సక్సెస్ అవుతుందా? అనేది మిగతా కథలో తెలుసుకోవాల్సిందే…?
నటీనటుల పర్ఫార్మెన్స్ :
డిఫరెంట్ టైపు పాత్రలు చేస్తున్న నారా రోహిత్ తొలిసారి లోకల్ రాజు అనే మాస్ పాత్రను చేసాడు. మాస్ క్యారెక్టర్ చేయడం అంత సులువు కాదు. బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకూ అన్ని మాస్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఆ పరంగా నారా రోహిత్ సక్సెస్ అయ్యాడు. కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా ప్రతి విషయంలోనూ నారా రోహిత్ చాలా జాగ్రత్త పడ్డాడు. రాజు పాత్రకున్యాయం చేసాడనే చెప్పొచ్చు. బాక్సర్ గా కూడా బాగున్నాడు. నారా రోహిత్ మొదటి సినిమాకి ఈ సినిమాకి బరువు పెరిగాడు, కొంచెం బరువు తగ్గితే లవ్ సీన్స్ లో కూడా శభాష్ అనిపించుకోగలుగుతాడు. ఇక ఎమోషనల్ సీన్స్ లో తన గత చిత్రాల్లోలానే అద్భుతంగా నటించాడు. లతా హెగ్డే తన పాత్ర పరిధిమేరకు నటించింది. క్లయిమ్యాక్స్ సీన్ లో అద్భుతంగా నటించి తనలోని నటిని ఆవిష్కరించింది. వెన్నెల కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజితలు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విలన్ పాత్రకు కబీర్ పక్కాగా సరిపోయాడు. షకలక శంకర్ కామెడీ కితకితలు పెడుతుంది. అలీ బాక్సింగ్ రిఫరీగా తన దిన పరిది లో చేసాడు.
సాంకేతిక వర్గం:
ఇక దర్శకుడు కుమార్ నాగేంద్ర దర్శకత్వ విషయానికొస్తే, రీమేక్ సినిమాని బాగానే హేండిల్ చేసాడనిపించింది. ఇది తమిళ్ చిత్రం ‘మాన్ కరాటే” కి రీమేక్. కాని తెలుగు సినిమానే చూస్తున్నామనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. స్పోర్ట్స్ నేపధ్యం అంటేనే యూనివర్శిల్ సబ్జెక్ట్. కాబట్టి నేటివిటి ప్రాబ్లమ్ లేదు. డైరెక్టర్ కుమార్ నాగేంద్ర ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ ని డైరెక్టర్ కుమార్ నాగేంద్ర చక్కగా తీర్చిదిద్దాడు. బహుశా నారా రోహిత్ ఒరిజినల్ సినిమా చూసే ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఇదే అయ్యుంటుంది. ఒరిజినల్ వెర్షన్ కంటే నిడివి తగ్గించడం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. రోహిత్ లోని కామెడీ యాంగిల్ ని చక్కగా ప్రజెంట్ చేసాడు. సాయి కార్తీక్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. వైజాగ్, దాని పరిసర ప్రాంతాలను సినిమాటోగ్రాఫర్ అందంగా చూపించాడు. ఎడిటింగ్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. డైలాగులు ఫన్నీగా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ ఫర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
విశ్లేషణ:
బాక్సింగ్ నేపధ్యం లో తెలుగు లో గతం వచ్చిన చిత్రాలు తమ్ముడు , అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి ఈ చిత్రాలలో పోటిలకు వెళ్ళడానికి సరైన కారణం వుంటుంది కాని ఈ చిత్రం లో అలాంటి భాలమైన రిసన్ కనపడదు. ఈ సినిమా తమిళ్ ఒరిజినల్ కథ బాగుంది కాబట్టే, తెలుగు ప్రేక్షకులకి కొత్తగా అనిపిస్తుంది. ఒక కల్పిత కథను నిజ జీవితానికి కనెక్ట్ చేసి చెప్పిన విధానం బాగుంది. స్ర్కీన్ ప్లే కూడా బాగా కుదరడం ఈ సినిమాకి ప్లస్. నారా రోహిత్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, డ్యాన్స్ లు ప్రేకకులను ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాల ప్రేకకులు సినిమాని ఎంజాయ్ చేస్తారు. డైలాగ్స్ పరంగా మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. వెయిట్ తగ్గి, ఇలాంటి పాత్రలు చేస్తే మాస్ హీరోలకు సాటిగా నారా రోహిత్ రాణిస్తాడు. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. నారా రోహిత్ లోని మాస్ యాంగిల్ ని బయటపెట్టే సినిమా. ఏ రకంగా చూసుకున్న ఇది టైమ్ పాస్ చిత్రం మాత్రమే.
తెలుగు360.కామ్ రేటింగ్: 2.5/5
బ్యానర్ : శ్రీ కీర్తి ఫిలిమ్స్
నటీనటులు : నారా రోహిత్, లతా హెగ్డే, కబీర్, అలీ, దూహన్ సింగ్, వెన్నెల కిశోర్, షకలక శంకర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజిత తదితరులు
సంగీతం: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ : ఎం.ఆర్.పళనికుమార్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాతలు : నాగార్జున, అశోక్ బాబా
కథ : ఎ.ఆర్.మురుగదాస్
దర్శకత్వం : కుమార్ నాగేంధ్ర
విడుదల తేది : 11.03.2016