సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరపడానికి వెళ్ళిన రష్యాకి చెందిన ఎస్.యు.24 యుద్దవిమానాన్ని టర్కీ వాయుసేన, మంగళవారం ఉదయం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9.20 గంటలకు కూల్చి వేసింది. విమానం నుండి పారాచూట్ సహాయంతో క్రిందకు దూకిన ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించగా మరొకరు దురదృష్టవశాత్తు ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చిక్కినట్లు సమాచారం. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేస్తున సమయంలో రష్యా యుద్ద విమానాలు తమ గగనతలంలోకి చొరబడుతున్నాయని, పదేపదే హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోకపోవడంతోనే తమ ఎఫ్.16 యుద్ద విమానాలు దానిని కూల్చివేసాయని టర్కీ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ రష్యన్ యుద్దవిమానం సిరియా సరిహద్దుకు సుమారు 4 కిమీ లోపల కూలిపోవడంతో, ఉగ్రవాదులను కాపాడేందుకే టర్కీ తమ విమానాన్ని కూల్చివేసిందని రష్యా ఆరోపిస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదీమీర్ పుతిన్ మీడియాతో మాట్లాడుతూ “ఉగ్రవాదులకు టర్కీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని మేము భావించేలా ఉంది దాని ఈ చర్య. మా వాయుసేన ఒక గొప్ప కార్యం కోసం చాలా వీరోచితంగా ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతోంది. దానికి టర్కీ ప్రభుత్వం వెన్ను పోటు పొడిచి ఉగ్రవాదులతో చేతులు కలిపినట్లు వ్యవహరించింది. ‘నాటో’ కూడా ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వాలని టర్కీ భావిస్తోందా? ఈరోజు అది చేసిన పనికి అది తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు,” అని పుతీన్ హెచ్చరించారు.
టర్కీ ప్రభుత్వం రష్యా ఆరోపణలను గట్టిగా ఖండించింది. “రష్యా యుద్ద విమానాలు మా గగనతలంలో చొరబడటం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు చాలా సార్లు అలా జరిగినప్పుడు మేము రష్యా ప్రభుత్వానికి మా నిరసనలు తెలియజేశాము. అప్పుడు రష్యా వైమానిక అధికారులు మా వద్దకు వచ్చి అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. మళ్ళీ అటువంటి గగనతల అతిక్రమణలు జరుగవని హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత కూడా చాలాసార్లు రష్యా యుద్ద విమానాలు మా గగనతలంలోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా మేము పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రష్యా యుద్ద విమానంమా గగనతలంలోకి ప్రవేశించింది. మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే ప్రయత్నంలోనే మా వాయుసేనలు రష్యా యుద్ద విమానాన్ని కూల్చవలసి వచ్చింది తప్ప మాకు ఎవరితోనూ వైరం లేదు. రష్యా ఆరోపిస్తున్నట్లు మేము ఉగ్రవాదులకి మద్దతు ఈయడం లేదు,” అని టర్కిష్ మిలటరీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో అందరూ చేతులు కలపకపోగా, ఒకరి యుద్ద విమానాలు మరొకరు కూల్చుకోవడంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడటం చాలా ఆందోళన కలిగిస్తోంది. రష్యా యుద్ద విమానాలు సిరియా, టర్కీ సరిహద్దుల్లో నివసిస్తున్న టర్కీమన్ అనే ఒక జాతి వారిపై కూడా దాడులు చేస్తుండటమే టర్కీ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. టర్కీమన్ జాతి వారిని తమ పూర్వీకుల సంతతికి చెందినవారిగా టర్కీ ప్రజలు భావిస్తుంటారు. వారిపై రష్యా తెలిసో తెలియకో దాడులు చేస్తుండటం టర్కీ జీర్ణించుకోవడం కష్టమే. బహుశః ఆ కోపంతోనే రష్యా యుద్ద విమానాన్ని కూల్చివేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు జరిగిన ఈ సంఘటనతో టర్కీ, రష్యా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని రష్యా ఉగ్రవాదులపై వైమానిక దాడులను నిలిపివేస్తుందా లేక యదాప్రకారం కొనసాగిస్తుందా చూడాలి.