పసుపు బోర్డు కోసం నిజామాబాద్ పసుపు రైతులు చేసిన ఉద్యమం ఫలించింది. గత ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిచేసిన ప్రకటన ఇప్పటికీ కార్యాచరణలోకి వచ్చింది. నిజామాబాద్‌కు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ బోర్డుకు నిజామాబాద్‌కే చెందిన పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తారు.
నిజామాబాద్‌లో పసుపు పండించే రైతులు అధికంగా ఉంటారు. వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, ఇతర సాయాలు అందించే వ్యవస్థ లేదు. పైగా పసుపు వాణిజ్య పంట. ఈ కారణంగా రైతులు ప్రతీ సారి దళారుల కారణంగా, ఇతర కారణాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని రైతులు ఉద్యమించారు. 2019లో నిజామాబాద్‌లో అత్యధిక మంది రైతులు లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసి తమ ఆకాంక్షను దేశం మొత్తానికి చాటారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ రైతులకు పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ రాసిచ్చారు.
తర్వాత పసుపుబోర్డు కాకుండా సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయకార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ప్రధాని మోదీ బోర్డు ఏర్పాటును ప్రకటించారు. ఏడాదికి అది ఆచరణలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి తాము ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నామని చెప్పే అవకాశం లభించింది. ఎంపీ అర్వింద్‌కు ఇది పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు.